పాఠశాలల అభివృద్ధికి రేవంత్ సర్కారు కీలక నిర్ణయం..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు చిన్నపాటి రిపేర్లను వేసవి సెలవుల లోపు పూర్తి చేసేందుకు ఎమర్జెన్సీ అండ్ మెయింటనెన్స్ ఫండ్ విడుదల చేయనుంది.

 

ప్రభుత్వం కొత్తగా ఇచ్చే ఈ నిధులతో పాఠశాలలకు అవసరమైన ట్యూబ్ లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, స్విచ్చులు, నీటి సరఫరా ఏర్పాట్లు చేసుకోవచ్చు. వీటన్నింటినీ ప్రభుత్వ బడుల్లో ఏర్పాటు చేయనున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టనున్నాయి.

 

కలెక్టర్ దగ్గర అందుబాటులో ఉన్న జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ తోపాటు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను పాఠశాలల అభివృద్ధికి ఉపయోగించనున్నారు. వచ్చే జూన్ 10 లోపు అంటే వేసవి సెలవులలోపు పాఠశాలల మరమ్మతులను పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. దీనికి సంబంధించిన విధివిధినాలను కూడా రూపొందించింది.

 

పాఠశాలల్లో చేపట్టిన లక్ష రూపాయల విలువైన వాటికి డైరెక్టుగా ఎంపీడీవోలే చెల్లింపులు చేయనున్నారు. అంతకుమించితే జిల్లా కలెక్టర్ల ద్వారా బిల్లులు పొందాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కాగా, ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ల నుంచి పాఠశాలల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయంటున్నారు. చాలా పాఠశాలల్లో కనీసం తాగునీరు, క్లాస్ రూంలు, తలుపులు, కిటికీలు, వాష్ రూం క్లీనింగ్ వంటివి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ సమస్యలకు చరమగీతం పాడొచ్చని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *