బీఆర్ఎస్‌‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ..

మొన్నటి వరకు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో ఆయనకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గులాబీ కండువా కప్పారు. ఇదే సమయంలో కొంతమంది నేతలతో కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఘోర పరాజయాన్ని చవిచూశారు. లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు దగ్గరయ్యారు. కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే బీఆర్ఎస్-బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. హైదరాబాద్ , నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకరాలను బీఎస్పీకి కేసీఆర్ కేటాయించారు. నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు.

 

దేశంలో ఏ పార్టీతో బీఎస్పీకి పొత్తు లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించడంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలవరపడ్డారు. తెలంగాణలో పొత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని తొలుత ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ తో పొత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి రావడంతో బీఎస్పీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు గులాబీ కండువా కప్పుకుని లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తాను తప్పనిసరి పరిస్థితుల్లోనే పార్టీ మారారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *