ఎలక్టోరల్ బాండ్ల డేటా రిలీజ్ చేసిన సీఈసీ.. అగ్రస్థానంలో బీజేపీ..

కేంద్ర ఎన్నికల సంఘం సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ డేటాలో బాండ్లు జారీ చేసిన తేదీలు, సొమ్ము వివరాలు, ఏ ఎస్బీఐ బ్రాంచ్ జారీ చేసిందనే సమాచారం ఉంది. ఈ డేటా ప్రకారం బీజేపీ అత్యధికంగా రూ.6,986.5 కోట్ల రూపాయలను విరాళాల రూపేణ సేకరించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తృణమూల్ కాంగ్రెస్ రూ.1,397కోట్లు, కాంగ్రెస్ రూ.1,334 కోట్లు, బీఆర్ఎస్ పార్టీ రూ.1,322 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించాయి.

 

ప్రాంతీయ పార్టీలైన బీజేడీ రూ.944.5 కోట్లతో నాలుగవ స్థానంలో ఉండగా, డీఎంకే రూ.656.5కోట్లు, వైఎస్ఆర్సీపీ రూ.442.8 కోట్లు, జేడీఎస్ రూ.89.75కోట్ల రూపాయిలు సేకరించాయి. జేడీఎస్ కి వచ్చిన నిధుల్లో మేఘా ఇంజినీరింగ్ కంపెనీయే రూ.50 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేయడం విశేషం. ఇది రెండవ అతిపెద్ద బాండ్ల కొనుగోలు దారుకాగా, ప్రథమస్థానంలో లాటరీ సంస్థ అయిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. ఇందులో రూ.509 కోట్లు డీఎంకే పార్టీ స్వీకరించింది. ఈ కంపెనీ విరాళాల్లో 37 శాతం డీఎంకేకు దక్కాయి.

 

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ ఈనెల 12 సాయంత్రానికే కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఆ తర్వాతి రోజు సుప్రీం ధర్మాసనానికి సీల్డ్ కవర్ లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఈనెల 15 సాయంత్రానికి అందుబాటులో ఉంచాలని సీఈసీని సుప్రీం ఆదేశించింది. 15న అధికారిక వెబ్సైట్ లో వెల్లడించిన వివరాలను సీఈసీ నేడు బహిర్గతం చేసింది. ఈ బాండ్లన్నింటినీ పార్టీలు క్యాష్ చేసుకున్నాయని తెలిపింది కానీ ఎవరెవరి నుంచి ఎంత మొత్తంలో సేకరించారన్న వివరాలు మాత్రం లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *