రేపు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ


రేపు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ

– మలక్‌పేట టీవీ టవర్‌ నుండి సరూర్‌నగర్‌ మైదానం వరకు రెడ్‌షర్టు వాలంటీర్ల ప్రదర్శన 
– మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం 
– సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభ 
– భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రజానీకానికి పిలుపు 
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ 
సీపీఐ (ఎం) అఖిల భారత 22వ మహాసభల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మలక్‌పేట టీవీ టవర్‌ నుంచి సరూర్‌ నగర్‌ మైదానం వరకు వేలాది మంది రెడ్‌షర్టు వాలంటీర్లు కవాతు నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. ఈ సభకు రాష్ట్ర సెంటర్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కార్యకర్తలు హాజరు కావాలని మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలొచ్చే పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు, ప్రజలు మధ్యాహ్నం మూడు గంటలకల్లా మలక్‌పేట టీవీ టవర్‌ వద్దకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ మార్గాల్లో వాహనాల్లో వచ్చే వారు కూడా మలక్‌పేట టీవీ టవర్‌ వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి ప్రదర్శనగా సరూర్‌నగర్‌ గ్రౌండ్‌కు చేరుకోవాలని సూచించారు. ప్రదర్శకులను మలక్‌పేటలో దించిన తర్వాత వారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలాలకు వాహనాలను తరలించాలని సూచించారు. రెడ్‌షర్టు వాలంటీర్లు.. ప్రదర్శన ప్రారంభ సమయానికంటే ముందుగానే చేరుకోవాలని కోరారు. క్రమశిక్షణతో మార్చ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. డప్పు కళాకారులు ఉదయం 9 గంటలకు ఆర్టీసీ కళాభవన్‌ (మహాసభ ప్రాంగణం)కు చేరుకోవాలని సూచించారు. అక్కడి నుండి మధ్యాహ్నం మూడు గంటలకు మలక్‌పేట టీవీ టవర్‌ దగ్గరకు చేరుకోవాలని తమ్మినేని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *