ఎస్సారెస్పీ కాల్వ పనుల అడ్డగింత

ఎస్సారెస్పీ కాల్వ పనుల అడ్డగింత

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో నిర్మాణంలో ఉన్న ఎస్సారెస్పీ ఎల్‌6 కెనాల్‌ ఆధునీకరణ పనులను కన్నాల రైతులు అడ్డుకున్నారు. సింగరేణి పనుల వల్ల కెనాల్‌ కుంగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సింగరేణి అడ్రియాల ప్రాజెక్టు నిర్మాణం వల్ల కెనాల్‌ కుంగిపోయిందన్నారు. ప్రస్తుతం రూ.16కోట్లతో చేపడుతున్న ఎస్సారెస్పీ ఎల్‌6 కెనాల్‌కూ అదే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాల్వ పూర్తయితే రామగిరి మండలం రాజాపూర్‌ నుంచి మంథని, కన్నాల, నాగారం మల్లెపల్లి, గుంజపడుగు గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలు సాగవుతుందన్నారు. సింగరేణి పనుల వల్ల కాలువ మళ్లీ కుంగుతుందని, అందువల్ల ఈ కాలువకు బదులుగా ఉప్పట్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికి నాలుగు సంవత్సరాలుగా పనులు చేపడుతున్నా ఫలితం లేదన్నారు. వెంటనే కాలువ పనులు నిలిపేసి ఉప్పట్ల పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ ఆందోళనలో జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్‌ గుడిసె గట్టయ్య యాదవ్‌, సర్పంచ్‌ మాచిడీ రమేష్‌గౌడ్‌, యాదవ సంఘం నాయకుడు ఉడుత పర్వతాలు యాదవ్‌, దయాకర్‌రెడ్డి, కనుకయ్య, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *