బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత

బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ : సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. తక్షణమే ప్రధానమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  బాలయ్య ఇంటి ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అదే సమయంలో నివాసానికి వస్తున్న బాలకృష్ణ  వాహనాన్ని అడ్డుకున్న కార్యకర్తలు, మోదీకి క్షమాపణ చెప్పాలంటూ అడ్డుకున్నారు. కారు దిగి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేయగా, అందుకు నిరాకరించిన ఆయన పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లిపోయారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఇంట్లోకి దూసుకు వెళ్లేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  భారీగా మోహరించిన  పోలీసులు.. బీజేపీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
కాగా ప్రధాని మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని బాలకృష్ణ తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఈ విషయంలో తాను చాలెంజ్‌ చేస్తున్నానని అన్నారు. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో బాలకృష్ణ …ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *