నేడే టీడీపీ రెండో జాబితా..

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కసరత్తు తుదిదశకు చేరుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయడు తొలి జాబితాలో 94 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం విడుదల చేస్తామని మీడియాతో చిట్చాట్‌లో చంద్రబాబు తెలిపారు. ఇందులో వీలైనంత ఎక్కువ మందిని ప్రకటిస్తామని తెలిపారు.

 

జనసేన, బీజేపీ ఏయే స్థానాల్లో పోటీ చేసేది వారికి స్పష్టత ఉందని, సమయానుకూలంగా ఆ పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాగా, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ, జనసేనకు రెండు పార్లమెంట్‌, 21 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి.

జనసేన ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు 50 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొదటి జాబితాలో పేరు రాని ఆశావహులు చంద్రబాబును కలుస్తున్నారు. ప్రస్తుతం వారిలో సీటు దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠ కొనసాగుతోంది.

 

పొత్తులో భాగంగా 31అసెంబ్లీ స్థానాలను జనసేన, బీజేపీలకు కేటాయించటంతో మరో 50 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అలాగే 8పార్లమెంట్ స్థానాల్లో జనసేన, బీజేపీలు పోటీ చేయాలని నిర్ణయించినందున 17మంది పార్లమెంట్ అభ్యర్థులను కూడా తెలుగుదేశం ప్రకటించాల్సి ఉంది. మొత్తం ఈ 67మంది అభ్యర్థుల్లో ఎంతమందిని మలిజాబితా కింద ప్రకటిస్తారనే ఉత్కంఠ ఆశావహుల్లో ఉత్కంట నెలకొంది.

 

గురువారం ఎంత ఎక్కువ మందిని వీలైతే అంతమందిని ప్రకటించేస్తామని చంద్రబాబు స్పష్టం చేయటంతో ఆ సంఖ్య ఎంతనేది చర్చనీయాంశంగా మారింది. గురువారం ప్రకటించేదే తుది జాబితా కాదనీ, మరో జాబితా కూడా ఉండవచ్చనే సంకేతాలు పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చాయి. ఇక, సంఖ్యాపరంగా 9 అంకె సెంటిమెంట్‌ను టీడీపీ అనుసరిస్తున్నందున ప్రకటించే అభ్యర్థుల సంఖ్య 27 ఉంటుందా లేక 36 ఉంటుందా లేక 45 ఉంటుందా లేక 54 ఉంటుందా? అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

కాగా, అరకు, విజయనగరం, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలుస్తోంది. కాకినాడ, మచిలీపట్న స్థానాల్లో జనసేన పోటీచేయనున్నట్లు సమాచారం. తమకు కేటాయించిన 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన 6 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేయటంతో మరో 15మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. వీటిపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీ పోటీ చేసే 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి కేటాయించినవి 10 సీట్లే కావడంతో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *