ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడిన తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడును పెంచాయి. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులు ఎంపికను శరవేగంగా చేస్తున్నారు.
ఇప్పటికే జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను పిలిపించుకొని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, మరో 9 మంది అభ్యర్థులకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. వీరిని ఎన్నికల ప్రచారం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం.ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ కు జనసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అంతేకాదు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి కూడా జనసేన అభ్యర్థులను ఖరారు చేసి వారిని కూడా ప్రచారం చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి ఉంగుటూరు నియోజకవర్గానికి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నియోజకవర్గం నుంచి రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ లకు జనసేనాని అవకాశం ఇచ్చారని సమాచారం.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుండి దేవ వరప్రసాద్ కు అవకాశం ఇవ్వగా, తిరుపతి నుండి ఆరణి శ్రీనివాసులతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇక ఈ స్థానం కూడా దాదాపు ఫైనల్ చేసినట్టేనని చెబుతున్నారు. ఇక వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ వాళ్లకు కీలక దిశ నిర్దేశం కూడా చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరాలని, ఈ ఎన్నికలు రాష్ట్ర గతిని మార్చే ఎన్నికలనీ పవన్ కళ్యాణ్ వారికి సూచించారు. టిడిపి జనసేన బిజెపి కూటమి పోరాడుతున్నది హింస, కక్ష సాధింపులు, అరాచకాలు నమ్ముకున్న పార్టీతో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ వారికి సూచించారు. ఇక ఎన్నికల కురుక్షేత్రంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేతలకు దిశ నిర్దేశం చేశారు.
అభ్యర్థులు ఎంపిక విషయంలో సర్వేల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్టు ఇక సర్వే ఫలితాలలో ఏముందో వారికి అర్థమయ్యేలా చెప్పి ముఖ్యమైన అన్ని విషయాలను వారికి తెలియజేశారు. ఇదిలా ఉంటే రానున్న ఎన్నికలకు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలను కేటాయించారు.
ఇప్పటికీ గతంలో ప్రకటించిన ఆరు స్థానాలతో పాటు తాజాగా తొమ్మిది స్థానాలను ఖరారు చేయగా మిగతా స్థానాల ఎంపికకు సంబంధించిన ఫైనలైజేషన్ త్వరలో చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఇప్పటికి 15 స్థానాలు ఖరారు కాగా మరో ఆరు స్థానాల పైన కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.