ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మంగళవారం సాయంత్రం ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)కు సంబంధించిన డేటాను భారత ఎన్నికల కమిషన్‌(Election Commission)కు సమర్పించింది. బాండ్ల వివరాలు అందినట్లు ఈసీ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు డేటా ఈసీ వెబ్‌సైట్లో ప్రచురించనుంది.

 

ఫిబ్రవరి 15న ఒక చారిత్రాత్మక నిర్ణయంలో, సుప్రీంకోర్టు ప్రభుత్వ ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి వాటిని రద్దు చేసింది. దాతలు, వారు అందించిన మొత్తాల గురించి ఎన్నికల సంఘం తప్పనిసరిగా వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. మార్చి 15 లోగా ఈ వివరాలు ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్లో ప్రచురించాలని కోర్టు ఆదేశించింది.

 

బాండ్ల వివరాలను వెల్లడించడానికి జూన్ 30 వరకు పొడిగించాలని మార్చి 4న SBI సుప్రీం కోర్టు ఆదేశించింది. SBI అభ్యర్థనపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం( మార్చి 11) దాన్ని తోసిపుచ్చింది. కేవలం బాండ్ల వివరాలు అందించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మండిపడింది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 11 వరక అంటే గత 26 రోజులుగా ఏం చేశారని ప్రశ్నించింది. మంగళవారం బ్యాంకు పని వేళలు ముగిసేలోగా బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందచేయాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం తీర్పునిచ్చింది. SBI వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

 

దీంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం SBI ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు పంపించింది. SBI నుంచి బాండ్ల వివరాలు అందాయని.. తాము కూడా కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని మార్చి 15 లోగా వెబ్‌సైట్లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను పొందుపరుస్తామని ప్రకటించింది.

 

2018లో పథకం ప్రారంభించినప్పటి నుంచి, SBI 30 వేర్వేరు ఇష్యూలలో రూ.16,518 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *