ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేనలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన గతంలో భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. కుబేరులు ఎక్కువగా ఉండే భీమవరం రౌడీ చేతిలో బందీగా మారిందని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే చేసిన అరాచకాల ప్రభావం అతని కులంపై పడుతోందన్నారు.
భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. భీమవరాన్ని తాను వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఇక్కడ నుంచి రౌడీయింజ పోయే వరకు పోరాడతానని తేల్చిచెప్పారు. జనసేన అభ్యర్థిని గెలిపిస్తే భీమవరంలో డంపింగ్ యార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పులపుర్తి రామాంజనేయులు చేరిక జనసేనకు బలాన్ని ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనే టీడీపీ, జనసేన పొత్తు విషయంలో కీలకంగా మారారని తెలిపారు. 2019 ఎన్నికల్లో భీమవరంలో తాను ఓడిపోయినా జనం మద్దతుగా నిలిచారని చెప్పారు.
రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని జనసేనాని స్పష్టం చేశారు. బంధుత్వాలు ఉండవన్నారు. అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చడమేనని స్పష్టంచేశారు. వైసీపీ నేతలు చేస్తున్న దాడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తున్న జగన్ ఓడిద్దామన్నారు.