ప్రత్యేక అభివృద్ధి నిధితోనే బీసీల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. వచ్చే బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సందర్భంగా బీసీ సంగం నేత జక్కా మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా 52 శాతం దాటిందని, ఆ మేరకు నిధులు ఖర్చు చేయాలన్నారు.
ప్రధాన శాఖల ద్వారా అమలు చేసే సంక్షేమ పథకాలకు ఒకే చోట కేటాయించి ఖర్చు చేయాలని, దీంతో బీసీల్లోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చెరో రూ.2 వేల కోట్లు కేటాయించి నిరుద్యోగులకు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని సూచించారు. కులవృత్తులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, దీనికి కార్యాచరణ తయారు చేయాలన్నారు. బీసీ ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని సకాలంలో మంజూరు చేయాలని కోరారు.
ర్యాంకుతో నిమిత్తంలో లేకుండా విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని, గురుకులాల సంఖ్యను పెంచాలన్నారు. కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన బీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.