ఖాళీ అవుతున్న కారు.. లోక్ సభ ఎన్నికలకు ముందే కేసీఆర్ బేజారు..!

తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురు కాబోతుంది. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కెసిఆర్ కు షాక్ ఇస్తూ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారడం గులాబీ అధినేతను ఆందోళనకు గురిచేస్తుంది. నిన్న మొదటి వరకు కెసిఆర్ బలగం, బలం అనుకున్న నాయకులు ఇప్పుడు పక్క చూపులు చూడడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది.

 

తాజాగా మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడెం నగేష్ లు బిజెపి బాట పట్టడం గులాబీ అధినేత కేసీఆర్ కు ఊహించని షాక్ ఇచ్చింది. నలుగురు కీలక నేతలు బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరడం ప్రస్తుతం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. బిజెపి రాష్ట్ర ఇన్చార్జి లక్ష్మణ్ సమక్షంలో వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయింది.

 

వాస్త‌వానికి వీరు ముందుగానే పార్టీ మారుతార‌ని తెలిసినా.. కేసీఆర్‌, కేటీఆర్ లేదా హ‌రీష్‌రావుల నుంచి ఎలాంటి స్పంద‌నా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఒకపక్క పార్టీ మారే వారిని అడ్డుకోవడానికి గులాబీ నేతలు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులు పార్టీ మారుతున్న నేతలను ఆపడానికి తమ వంతుగా ప్రయత్నం చేసిన దాఖలాలు కూడా లేవు.

కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న సైదిరెడ్డి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నాడు అని తెలిసినప్పటికీ అతడిని ఆపడంలో కేటీఆర్ ఫెయిలయ్యారు. అసలు ఎటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా అనిపించలేదు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి గత ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఇక తాజాగా పార్టీ నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

 

ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావు సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా చెప్పినప్పటికీ ఆయన కూడా గులాబీ అధినేతకు గుడ్ బై చెప్పేసారు. ఇక రానున్న రోజులలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

 

ఇప్పటికే ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో నేతలు బీజేపీ, కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఒకపక్క లోక్సభ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించి మళ్లీ తన పట్ట నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ను కారు దిగుతున్న నేతల తీరు బేజారుకు గురిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *