బీజేపీలో ప్రో వైసీపీ నేతలపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..

ఏపీలో ఎన్నికల మహా సంగ్రామానికి సమయం దగ్గర పడుతోంది. అధికార వైసీపీని ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన, భారతీయ జనతాపార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. వాస్తవానికి బీజేపీలో ప్రో టీడీపీ, ప్రో వైసీపీ నేతలున్నారు. ప్రో టీడీపీ నేతలు పొత్తు ఉండాలని కోరుకోగా, ప్రో వైసీపీ నేతలు పొత్తు ఉండకూడదని కోరుకున్నారు. టీడీపీతో పొత్తు కుదరకుండా ఉండేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత చంద్రబాబు తిరిగి బీజేపీతో కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

 

ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయినందుకు బాధ్యత వహిస్తూ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వైదొలగడంతో సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టారు. వైసీపీపై విమర్శలు చేయడంతోపాటు టీడీపీపై కూడా విమర్శలు చేశారు. ప్రతి విమర్శలో కచ్చితంగా చంద్రబాబు పేరు ఉండేలా చూసుకునేవారు. బీజేపీతో చంద్రబాబు కలవాలనే ప్రయత్నాన్ని నిలవరించేవారు. తెలుగుదేశంతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెప్పేవారు. అలాగే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ఉండటంతోపాటు పొత్తు వద్దని అధిష్టానం దగ్గర గట్టిగా చెప్పేవారు.

 

TDP chief Chandrababu has formulated a master plan to stop pro-YCP leaders in BJP

అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కూడా టీడీపీతో పొత్తు ప్రయత్నాలను బలంగా అడ్డుకునేవారు. పొత్తు కుదరకుండా ఉండేందుకు చివరి వరకు లాబీయింగ్ చేశారని ఆ పార్టీ నాయకులే విమర్శలు చేసేవారు. పొత్తులో భాగంగా ఈ ముగ్గురు నేతలు ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి చంద్రబాబునాయుడు అడ్డుతగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఈ ముగ్గురు నాయకులు బీజేపీలోని అగ్ర నేతల దగ్గర ఉన్న పరిచయంతో టికెట్లు తెచ్చుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ వారిని తప్పకుండా ఓడించే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవడంవల్ల తెలుగుదేశం, జనసేన మీదే ఆధారపడాలి. ఈ ముగ్గురు నాయకులకు ఈ రెండు పార్టీలు ఎంతవరకు సహకరిస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. పొత్తుకు అడ్డుతగిలినవారిని పక్కకు తప్పించాలనే యోచనలో టీడీపీ ఏ విధంగా వ్యవహరించబోతున్నదన్నది ఆసక్తికరంగా మారింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *