జిల్లాలోని మేదరమెట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సిద్ధం’ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో సభలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా స్థలికి చేరుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఒంగోలు నగరపాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఉదరగుడి మురళి(30) ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇది ఇలావుండగా, సిద్ధం సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు. సభకు హాజరై తిరిగి వెళ్తుండగా బస్సు ముందు డోర్ వద్ద నిల్చుని ఉణ్న బాలదుర్గ.. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు.
అయితే, బస్సు వెనుక టైర్లు అతని తలపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే బాలదుర్గ ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడంతో అక్కడివారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మేదరమెట్ల సిద్ధం సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సభలో సీఎం జగన్ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. తనను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2014లోనూ ఇలాగే ముగ్గురూ కలిసి వచ్చారని, మేనిఫెస్టోపై ఫొటోలు వేసుకున్నారని, ఆ మేనిఫెస్టోపై చంద్రబాబు సంతకం పెట్టారని సీఎం జగన్ వెల్లడించారు. ఎంతమంది కలిసివచ్చినా వైసీపీదే గెలుపని స్పష్టం చేశారు.