పోలింగ్ బూత్ లో ఆ తర్వాత స్ట్రాంగ్ రూంలో కనిపించాల్సిన ఈవీఎంలు రోడ్డుపై అదీ ప్రభుత్వ వాహనం కాకుండా ఆటోలో అదీ కూడా అర్ధ రాత్రి సమయంలో కనిపిస్తే వార్త కాదా? జర్నలిజం లోకి కొత్తగా వచ్చిన వారు కూడా పరుగెత్తుకుంటూ వెళ్లి ఎలక్ట్రానిక్ మీడియా అయితే కెమెరాలో చిత్రీకరిస్తారు, ప్రింట్ మీడియా అయితే అక్కడున్న వారితో మాట్లాడి వివరాలు తీసుకుంటారు. ఇది నేరం ఎలా అవుతుంది? కానీ తెలంగాణలో మాత్రం ఇది నేరమే. విధి నిర్వహణలో ఏ మాత్రం జాగ్రత్త వహించని అధికారులు తమ విధిని తాము నిర్వర్తిస్తున్న పాత్రికేయులపై కేసులు పెడుతున్నారు. జగిత్యాలలో ఈవీఎంలు అర్ధరాత్రి సమయంలో ఆటోలో తీసుకువెళుతూ కనిపించిన సంఘటనను తమ తమ మాధ్యమాలలో ప్రసారం చేసిన విలేకరులపై ప్రభుత్వం దారుణమైన కేసులు పెట్టింది.
ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అత్యంత కీలకమైనది. అన్ని విధాలుగా అది మీడియా ఫోకస్ చేయాల్సిన నియోజకవర్గం. 1. అక్కడ పసుపు, ఎర్రజొన్న రైతులు మొత్తం 167 మంది తమకు గిట్టుబాటు ధర రానందుకు నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. 2. అక్కడ టి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకురాలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్నారు. 3. పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ పోలింగ్ శాతంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి వినతి పత్రం సమర్పించారు. పోలింగ్ జరిగిన తీరు తమకు అనుమానం కలిగిస్తున్నదని ఆయన ఎన్నికల సంఘానికి చెప్పారు. ఈ వీ ఎం లకు స్ట్రాంగ్ రూంలో భద్రత లేదని లిఖితపూర్వకంగా వినతి పత్రం అందచేశారు. ఈ నేపధ్యంలో ఈ వీ ఎంలు బయట కనిపిస్తే అనుమానం రాదా? నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జగిత్యాలలో ఈ వీ ఎంలు బయట కనిపించగానే మీడియా ప్రతినిధులు పరుగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ సేకరించిన సమాచారం ప్రకారం వార్తలు రాశారు, ప్రసారం చేశారు. జరిగిన సంఘటనపై విచారణ జరిపి ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ ప్రచురించకపోయినా, ప్రసారం చేయకపోయినా సంబంధిత మీడియాపై కేసు పెట్టుకోవచ్చు.
నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు ఉండవా
కానీ ఇదేంటి? ఈ వీ ఎంలను ఏ మాత్రం జాగ్రత్త తీసుకోకుండా గాలికి వదిలేసిన అధికారులను తక్షణమే స్పస్పెండ్ చేయకుండా విలేకరులపై కేసులేంటి? ఆ ఈ వీ ఎంలు ఎంపి పోలింగ్ లో వాడినవి కాదని, ఆ టైపు వేరు ఈ టైపు వేరనే సాంకేతిక విషయాలు ఆ అర్ధరాత్రి సమయంలో విలేకరులకు ఎలా తెలుస్తుంది? పైగా ఈ వీ ఎం బాక్సును మాత్రమే వారు చూశారు తప్ప దాని విప్పతీసి చూడలేదే? అందుకు అవకాశం కూడా లేదే? మరి అలాంటప్పుడు రిపోర్టర్లపై కేసులు ఎలా పెడతారు? ఇది ప్రజాస్వామ్య దేశమా లేక నియంత్రత్వ దేశమా? ఎన్నికల సంఘానికి ఎన్నికల సమయంలో సర్వాధికారాలు ఉంటాయేమో కానీ ఇలాంటి కేసులు పెట్టే అధికారం కూడా ఉంటుందా? ఎన్నికల సంఘం ఏం చెబితే అది రాసుకుని వెళ్లాలనే నిబంధన చట్టంలో పెడితే అదే విధంగా మీడియా కూడా పాటిస్తుంది. ఎన్నికల సమయంలో మీడియా కవరేజిని మొత్తం నియంత్రించి షెడ్యూలు విడుదల అయిన నాటి నుంచి ఫలితం వచ్చే వరకూ ప్రతి రోజూ మేం చెప్పిందే, మేం ఇచ్చిందే ప్రసారం చేయాలి, మేం ఇచ్చిందే ప్రచురణ చేయాలని అనే నిబంధన చట్టంలో ఉందా?
వార్త రాయడం, ప్రసారం చేయడం నేరపూరిత కుట్రా?
జగిత్యాలలో జరిగిన ఈవీఎంల తరలింపుపై వార్త రాయడం కేవలం లోపాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి చెప్పడానికే కానీ అందులో ఎలాంటి నేరపూరిత కుట్ర ఉండటానికి ఆస్కారం లేదు. ప్రభుత్వాన్ని గానీ, ఎన్నికల సంఘాన్ని గానీ అప్రదిష్టపాలు చేయాలనే కుట్ర ఉండటానికి కూడా వీలు లేదు. అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను తరలించడంపై వార్తలు కవరేజ్ చేసిన 9మంది జర్నలిస్టులపై కేసులు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని జగిత్యాల అర్బన్ తాసిల్దార్ సుభాష్ చంద్రబోస్ చేసిన ఫిర్యాదుతో జర్నలిస్టు లపై 446, 186, 505/2 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన తహశీల్దార్ అసలు ఆ సమయంలో డ్యూటీలోనే లేడు. మరి ఆయన విధులకు జర్నలిస్టులూ ఏ విధంగా ఆటంకపరిచారు? తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు కేసు పెట్టించడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీనిపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జర్నలిస్టులు ఆందోళనకు సిద్ధమయ్యారు. డెమో ఈవీఎంలే అయినా వాటిని తరలించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపిన జాయింట్ కలెక్టర్ రాజేశం ఇప్పటి వరకూ ఎవరిపై చర్య తీసుకోలేదు.
ఈవిఎం ల తరలింపు వార్త కవరేజ్ చేసి కేసులపాలైన జర్నలిస్టులు
1 దుగ్యాల గోపికృష్ణారావు వెలుగు దినపత్రిక
2 శ్రీధర్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్
3 చింత నరేష్ సాక్షి టీవీ
4 రాజిరెడ్డి టీవీ5 న్యూస్ చానల్
5 సామ మహేష్ లోకల్ చానల్
6 గడ్డల హరికృష్ణ సీవిఆర్ న్యూస్ చానల్
7 హైదర్ అలీ మోజో టీవి
8 రవిందర్ ఆంద్రజ్యోతి విలేఖరి బీర్ పూర్
9అక్కినపెళ్లి వేణు (ఆంధ్రప్రభ బీరుపూర్)
వీరిపై పెట్టిన కేసులలో ఉద్దేశపూర్వకంగా పుకార్లను ప్రచారం చేసిన ఆరోపణలు ఉన్నాయి. అసలు ఈవీఎంలే బయట కనిపించకుండా వారు కనిపించాయని వార్త రాస్తే అది తప్పు అవుతుంది కానీ ఈవీఎంలు కనిపించాయి కదా? దానికి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కదా? మరి ఉద్దేశ్యపూర్వకంగా చేశారు అని కేసు పెట్టారేంటి? ఎన్నికల సంఘం అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.