పొత్తులో బిగ్ ట్విస్ట్, అమిత్ షా క్లారిటీ ..

ఏపీ పొత్తుల లెక్కల్లో మరో ట్విస్ట్. 2014 పొత్తులు రిపీట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ డిమాండ్లు చంద్రబాబుకు సమస్యగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం ద్వారా ఇక మూడు పార్టీల పొత్తు ఖాయమని భావించారు. కానీ, అక్కడే అసలు సమస్య మొదలైంది. బీజేపీ ఏం కోరుకుంటుందో అమిత్ షా తేల్చేసారు. ఇప్పుడు చంద్రబాబు చేతిలోనే నిర్ణయం ఉంది.

 

పొత్తుల చర్చలు : ఏపీలో పొత్తుల రాజకీయం కీలక దశకు చేరుకుంది. పొత్తు ఉండటం ఖాయమని భావిస్తున్న సమయంలోనే..కొన్ని అంశాలు రెండు పార్టీలకు సమస్యగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు అమిత్ షా, నడ్డాతో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ భేటీ అయ్యారు. కేంద్రంలో తాము 400 సీట్ల లక్ష్యంతో పని చేస్తున్నామని అమిత్ షా వివరించారు. బీజేడీతో ఒడిశాలో జరిగిన ఒప్పందం ప్రస్తావించారు. చెరిసగం సీట్లలో పోటీ చేసేలా బీజేడీతో చేసుకున్న ఒప్పందాన్ని వివరించారు. అదే తరహాలో తాము ఏపీలోనూ కోరుకుంటున్నామని స్పష్టం చేసారు. జనసేన మూడో పార్టీగా ఉండటంతో.. ఆ పార్టీకి మూడు సీట్లు ఇచ్చిన అంశాన్ని చంద్రబాబు వెల్లడించారు. మిగిలిన 22 స్థానాల్లో బీజేపీకి 4-5 సీట్లు ఇచ్చేందుకు సిద్దమని ప్రతిపాదించారు.

సీట్ల పై ప్రతిపాదనలు : కానీ, బీజేపీ ముఖ్య నేతలు మాత్రం టీడీపీ – బీజేపీ చెరి 11 స్థానాల్లో పోటీ చేద్దామని ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చినట్లు సమాచారం. అందుకు చంద్రబాబు క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసారు. బీజేపీకి 5 సీట్లు వరకు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స్థానాల్లో 2014లో కేటాయించిన విధంగా 13 స్థానాలు ఇవ్వాలని నడ్డా ప్రతిపాదించినట్లు సమాచారం. బీజేపీకి అరకు, ఏలూరు, రాజమండ్రి, తిరుపతి స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసారు. బీజేపీ నుంచి విశాఖ, విజయవాడ, నర్సాపురం, అరకు, హిందూపురం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఏలూరు స్థానాలు ఇవ్వాలని కోరారు. ఈ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసారని సమాచారం.

 

చంద్రబాబు ఒప్పుకుంటారా : బీజేపీ నేతలు మాత్రం టీడీపీ నుంచి 4-5 సీట్లు తీసుకుంటే ఉపయోగం లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. మధ్యే మార్గంగా 8 ఎంపీ సీట్లు కోరుతున్నట్లు తాజా సమాచారం. దీనికి చంద్రబాబు అంగీకరిస్తే పొత్తు పైన ప్రకటన ఉండే అవకాశం ఉంది. దీని పైన చంద్రబాబు సమయం కోరినట్లు చెబుతున్నారు. బీజేపీ తాజా ప్రతిపాదన పైన చంద్రబాబు, పవన్ చర్చలు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులతోనూ చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బీజేపీ కోరిన విధంగా సీట్లకు చంద్రబాబు అంగీకరిస్తే ఈ రోజునే కీలక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. 2014లో బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో మూడు చోట్ల మార్పులు ఉంటాయని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పొత్తు ఖరారు కావాలంటే చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తు పైన ఎలాంటి నిర్ణయం వస్తుందనే ఉత్కంఠ రాజకీయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *