చెట్లు.. పక్షులు.. జంతువులు.. ఇలా ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులపై ఎప్పటికీ మనిషి ఆధారపడాల్సిందే. వాటి వనరులను మనిషి దోచుకున్నాడేమో గానీ, అవే వన్యప్రాణులు మనుషుల అవసరం లేకుండా స్వేచ్ఛగా జీవనం సాగించగలవన్నది అక్షర సత్యం. లాక్ డౌన్ పుణ్యమా? అని మనిషి ఇంటికే పరిమితం కాగా.. పక్షులు, కొన్ని రకాల వన్యప్రాణులు ఎంచక్కా ఆహ్లాదకర వాతావరణాన్ని ఎం‘జాయ్’ చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్.. వాటికి వరంగా మారిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో వేసవి రోజుల్లో మనిషి నీరు పోస్తేనే కదా అవి బతికి బట్టకట్టేది.. అన్న సందేహం రాకమానదు. అయితే నిత్యం బిజీగా ఉండే రోడ్లు, కాలుష్యం, నిరంతర ధ్వనులతో భయపడి ప్రయాణం చేయలేని పక్షులు.. ఇప్పుడు చక్కర్లు కొడుతూ నగరం, నగర శివారులోని చెరువుల చెంతకు నిర్భయంగా చేరుకుని ఆనందంగా గడుపుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.