కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు వివాదాస్పదం అవుతున్నాయి. అందులో ఆయన సమర్పించిన ప్రమాణ పత్రంలో తేడాలు ఉన్నాయంటూ అమేథీలో పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ధ్రువ్ లాల్ ఆరోపించడం తెలిసిందే.
బ్రిటన్ లో రిజిస్టర్ అయిన కంపెనీల్లో రాహుల్ పేరు ‘రావుల్ విన్సీ’ అని పేర్కొన్నారని, కానీ ఆ సమాచారాన్ని ప్రమాణ పత్రంలో పొందుపరచలేదంటూ ధ్రువ్ లాల్ ఫిర్యాదు చేశారు. దీనిపై, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ అధినేత తన నకిలీ పేరుతో దేశాన్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బ్రిటన్, ఇటలీ దేశాల్లో రాహుల్ పేరు ‘రావుల్ విన్సీ’ అని, ప్రియాంక గాంధీ కూడా తన అసలు పేరేంటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ వారసుడు రాహుల్ గాంధీగానే అందరికీ తెలుసని, కానీ ఆ పేరుతో యావత్ దేశం మోసపోయిందని తెలిపారు. యూపీలోని ఘటంపూర్ ఎన్నికల సభలో మాట్లాడుతూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.