రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. తెరపైకి కేటీఆర్ బావమరిది..

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో తీగ లాగితే.. కొత్త కొత్త డొంకలన్నీ కదులుతున్నాయి. ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పాపాల లింకులు బయటపడటం కలకలం రేపుతోంది.

 

రాజేంద్రప్రసాద్ పాకాల అలియస్ రాజ్ పాకాల. ఈ పేరు డ్రగ్స్ ఈవెంట్స్ నడిపించే వారి నోట్లో నిత్యం నానుతూ ఉంటుంది. ఈయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రకరకాల పేర్లతో గచ్చిబౌలిలో పార్టీలు నిర్వహించేవారు. యువతీ, యువకులకు డేటింగ్ ఏర్పాట్లు కూడా చేసేవారు. అధికారంలో ఉన్న సొంత బావ ప్రభుత్వమే కాబట్టి.. రాజ్ పాకాల ఏం చేసినా అప్పుడు అడిగే వాళ్లెవరూ లేరు. అయితే.. అప్పట్లోనే ప్రతిపక్ష నేతలు రాజ్ పాకాల పాపాల చిట్టాను ప్రెస్ మీట్లు పెట్టి కడిగిపారేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదేళ్ల కిందటే ఆధారాలతో సహా రాజ్‌ పాకాల వ్యవహారాలన్నీ గాంధీభవన్ సాక్షిగా బట్టబయలు చేశారు. అయినా ఆ నాటి సర్కారులో ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు గచ్చిబౌలి డ్రగ్స్ కేసు సందర్భంగా రాజ్ పాకాల పేరు మార్మోగుతోంది.

 

డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ నిర్మాత కేదార్‌కు, రాజ్ పాకాలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. కేదార్‌ను బినామీగా రాజ్‌ పాకాలనే పెంచిపోషించాడనే టాక్ ఉంది. న్యూజెర్సీలో మిర్చి రెస్టారెంట్‌లో పని చేసేందుకు సిబ్బందని అక్రమంగా తరలించాడనే ఆరోపణలు కేదార్‌పై ఉన్నాయి. ఈ అంశంలో అమెరికాలో కేసులు నమోదవుతాయేమోనని భయపడి.. కేదార్ హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. ఇక్కడికి రాగానే బఫెలో వైల్డ్ వింగ్ పేరుతో బీఆర్ఎస్ బినామీగా ఎదిగి.. ఏడు రెస్టారెంట్స్ ఓపెన్ చేశాడు. హైలైఫ్, జూబ్లీ 800 పేరుతో పబ్స్ నడిపించాడు. వీటితో పాటు ఈవెంట్స్ నౌ కంపెనీ పేరుతో రాజ్ పాకాల నిర్వహించే ఈవెంట్స్‌ని దగ్గరుండి చూసుకునేవాడు. తర్వాత సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా పేరొందాడు.

 

సినిమాలతో నష్టాలు వచ్చినా, ఇతర దందాల్లో ఆదాయం ఫుల్లుగా ఉండటంతో.. విమానాలను అద్దెకు తీసుకుని నడిపించాడు కేదార్. ఇతని వెనుక రాజ్ పాకాల ఉన్నాడని సమాచారం. ఆ అనుమానాలు బలపడేలా ఆధారాలు బిగ్‌ టీవీకి దొరికాయి. గతంలో డ్రగ్స్ కేసులో ఈడీ, సిట్ విచారణను ఎదుర్కొన్న నవదీప్‌తో పాటు ఇప్పటి నిందితుడు కేదార్‌తో కలిసి రాజ్ పాకాల ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. కేదార్ భాగస్వామి అశ్విన్ జైన్ కారునే రాజ్ పాకాల వాడుతుండటంతో వీరి చీకటి ఆర్థిక బంధం బట్టబయలైంది.

 

మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజ్ పాకాల.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈవెంట్స్ చేసుకుంటూ బతికేవాడు. కేసీఆర్ హయాం మొదలయ్యాయక.. గత పదేళ్లలో 14 కంపెనీలను ఆర్ఓసీలో ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న ఈవెంట్స్ కాస్తా.. వరల్డ్ వైడ్ ఈవెంట్స్‌గా మారాయి. విమర్శలు రావడంతో రాజ్‌ పాకాల వివిధ రంగాల్లోకి అడుగు పెట్టాడు. మొయినాబాద్‌లో 8 ఎకరాల్లో ఫాంహౌజ్, అద్భుతమైన భవంతిని నిర్మించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పెద్ద పెద్ద విల్లాల్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు రాజ్‌ పాకాల. పెట్టుబడులు ఎక్కడెక్కడ ఉన్నాయో అతనికే తెలియని పరిస్ధితి ఉందని.. కేటీఆర్‌కి దగ్గరగా ఉన్నవారే చెప్పుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *