చంద్రబాబుతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ..

అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంగళవారం పలువురు నేతలు భేటీ అయ్యారు. తాజాగా, చంద్రబాబును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీని వీడి త్వరలో టీడీపీలో చేరనున్నారు ఈ ఎంపీ. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపైనే చంద్రబాబుతో భేటీలో ఆయన చర్చించినట్లు తెలిసింది.

 

మరోవైపు, ఇప్పటికే మెుదటి విడతలో టీడీపీ-జనసేన అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో, రెండో విడతలో తమ పేర్లు ప్రకటించాలంటూ చంద్రబాబుతో పలువురు నేతలు భేటీ అవుతున్నారు. టికెట్ ఆశించే నేతలు, టికెట్ రాదని తెలిసిన నేతలతో చంద్రబాబు విడివిడిగా భేటీ అవుతున్నారు. పోటీ చేసే అంశంతో పాటుగా, స్థానిక పరిస్థితులను చంద్రబాబు నేతలకు వివరిస్తున్నారు. టికెట్ రాని నేతలకు అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు హామీ ఇస్తున్నారు.

 

ఈ క్రమంలోనే తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు, పలువురు ఆశావహులు, సీట్లు ప్రకటించని స్థానాల ఆశావహులు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన నివాసంలో కలుస్తున్నారు. సీట్లు కోల్పోయిన నేతలను బుజ్జగించి రాజకీయ భవిష్యత్‌కు చంద్రబాబు హామీ ఇస్తున్నారు. కడప పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి.. చంద్రబాబు నివాసానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కడప లోక్‌సభ టికెట్ శ్రీనువాసులు రెడ్డి ఆశిస్తున్నారు.

 

కాగా, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని జయ చంద్రా రెడ్డికి కేటాయించారు. సోమవారం చంద్రబాబు నివాసానికి వచ్చి శంకర్ యాదవ్ కే సీటు ఇవ్వాలని నేతలు కోరారు. గుంటూరు- 2 సీటును ఆశిస్తూ అక్కడి ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర కూడా చంద్రబాబుని కలిశారు. జేసీ పవన్ రెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. పవన్ రెడ్డి అనంతపురం లోక్ సభ స్థానాన్ని ఆశిస్తున్నారు. అనంత లోక్సభకు పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే బీకే పార్దసారధికి చంద్రబాబు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *