పవన్ కు అధికారంలో వాటా..? ఉమ్మడి సభలో చంద్రబాబు ప్రకటన..?

ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న విపక్ష టీడీపీ, జనసేన ఇప్పటికే ఉమ్మడిగా అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేశాయి. ఇవాళ తాడేపల్లి గూడెం సభలో ఉమ్మడి అజెండాను కూడా ప్రకటించబోతున్నాయి. మ్యానిఫెస్టో విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే వీటన్నింటికీ మించి కూటమిలో భాగస్వామ్య పార్టీ జనసేనకు అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు అధికారంలో వాటా ఇచ్చే అంశంపై మాత్రం ఎటూ తేల్చకపోవడంతో ఆ పార్టీలో అసంతృప్తి కనిపిస్తోంది.

 

అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు అధికారంలో వాటా ఇస్తానని క్లారిటీ ఇస్తేనే రేపు ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరుగుతుందని కాపు నేత హరిరామజోగయ్య పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఇదే డిమాండ్ జనసేన పార్టీ నేతల నుంచీ వినిపిస్తోంది. లేకపోతే చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ కష్టపడటం ఏంటనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. ఇదే అదనుగా వీరి ఉమ్మడి ప్రత్యర్ధి వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేయడానికి ప్యాకేజీ తీసుకున్నారనంటూ జనసైనికుల్ని రెచ్చగొడుతోంది. దీంతో చంద్రబాబు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్ధితి నెలకొంది.

 

అయితే జనసైనికులు, హరిరామజోగయ్య, వైసీపీ ఏమనుకుంటున్నాయో పక్కనబెడితే రేపు ఓటు వేయాల్సిన ఓటర్లకు మాత్రం దీనిపై క్లారిటీ తప్పనిసరి. కాబట్టి బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా టీడీపీ-జనసేన కూటమి అయితే ఖాయం కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అధికారం ఎలా పంచుకుంటారనే దానిపై చంద్రబాబు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో లోకేష్ ఓ ఇంటర్వ్యూలో కూటమి గెలిస్తే సీఎంగా చంద్రబాబే ఉంటారని చెప్పేశారు. దీంతో టీడీపీపైనా ఆ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ తరుణంలో తాడేపల్లి గూడెం సభలో పవన్ కు అధికార భాగస్వామిని చేసే విషయంలో చంద్రబాబు కచ్చితంగా క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. పూర్తిగా కాకపోయినా పరోక్షంగా అయినా సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *