రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనుకాడట్లేదు.
ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, డాక్టర్ సంజయ్ కుమార్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇలా సీనియర్లందరూ పార్టీలు ఫిరాయించారు.
ఇదే క్రమంలో తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ ఫిరాయించారు. జనసేనలో చేరారు. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు కొత్తపల్లి సుబ్బారాయుడు. కండువాను కప్పి సాదరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు పవన్.
కొత్తపల్లి చేరికతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తమ పార్టీ మరింత బలపడుతుందని పవన్ కల్యాణ్ చెప్పారు. జిల్లాలో టీడీపీ- జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, అందుకే తమ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని చెప్పారు.
కొత్తపల్లి సుబ్బారాయుడు సొంత నియోజకవర్గం.. నరసాపురం అసెంబ్లీ. అయిదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారాయన. 1989 నుంచి 2004 వరకూ వరుసగా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా విజయఢంకా మోగించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 ఉప ఎన్నికలో మరోసారి గెలిచారు. అనంతరం వైసీపీలో చేరినప్పటికీ.. ఎక్కువ రోజులు ఉండలేకపోయారు.