వైసీపీ కంచుకోటను బద్ధలు కొట్టే పనిలో టీడీపీ..

ఏపీలో జరగనున్న మహా సంగ్రామంలో తలపడేందుకు వైసీపీ, తెలుగుదేశం అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రేపో, ఎల్లుండో ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావడమే తరువాయి కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే రీతిలో ఈ రెండు పార్టీలు తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతానికి జనసేనతో కలిసి సంయుక్తంగా ఇరు పార్టీలకు కలిపి 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు, జనసేన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి.

 

రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట కీలకమైన నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఎంతోమంది నాయకులు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19,555 ఓట్ల మెజార్టీతో గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. తర్వాత రెండోవిడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన సోదరుడు ప్రసాదరావుకు పదవి దక్కింది.

2004 నుంచి నరసన్నపేట నియోజవకర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ వరుసగా పోటీచేస్తూ వస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున, 2014, 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫునే పోటీ చేశారు. అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన సత్యనారాయణదొర గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు జరగనున్న నేపథ్యంలో మరోసారి తానే గెలుస్తాననే ధీమాను ధర్మాన కృష్ణదాస్ వ్యక్తపరుస్తుండగా, జనసేన, బీజేపీతో కలిసి ఏర్పాటు చేసే కూటమి బలం ద్వారా 2014 ఫలితాన్నే పునరావృతం చేస్తామనే ధీమాలో తెలుగుదేశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *