ఏపీ స్పీకర్ సంచలనం. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి.. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు.

 

ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. మరోవైపు, మద్దాల గిరి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. దీంతో ఇటీవలే విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేని సీతారం ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

అయితే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగనున్న క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచిన పార్టీని విడిచి మరో రాజకీయ పార్టీకి మారడంతోనే వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం ఏ పార్టీకి కలిసి వస్తుందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

 

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార వైయస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రజల్లోకి తమవైపునకు తిప్పుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటనలోనూ జగన్ పార్టీ ముందే ఉంది. ఇక, తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బహిరంగ సభలు, యాత్రలు, ర్యాలీలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తున్నాయి. పొత్తు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ.. జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతున్నప్పటికీ.. టీడీపీతో పొత్తుపై మాత్రం స్పష్టతనివ్వడం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *