నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కశ్మీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని అన్నారు.
‘రాజ్యాంగం, జాతీయ ఐక్యత సమావేశం-2024’లో ప్రసంగించిన ఫరూక్ అబ్దుల్లా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రజలకు ఒక నిజమైన ఎన్నికలను అందజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“నా ప్రజల నుంచి నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం, భారత్‌లో భాగమే, ఎప్పటికీ భారత్‌లో భాగమే అవుతుంది’’ అని అబ్దుల్లా అన్నారు. ఏదేమైనా, దేశవైవిధ్యం బలంగా మారాలంటే దానిని రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
“మతం మనల్ని విభజించదు, మతం మనల్ని ఏకం చేస్తుంది. చెడు అనే మతం లేదు, దానిని చెడుగా ఆచరించేది మనమే. మనం ముందుకు వెళ్లాలంటే, ఒకరికొకరు అండగా నిలవడం, ఈ దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఏకతాటిపై ఎదుర్కోవడం, మనల్ని విభజించాలనుకునే దురాచారాలపై పోరాడడమే ఏకైక మార్గం’ అని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగానికి నేడు ముప్పు పొంచి ఉందని తెలిపారు. అది బలంగా ఉండేలా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేకపోతే చింతించాల్సి వస్తుందని అన్నారు.