సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ విజయవాడలో తీవ్ర కలకలం రేపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కోసం ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన వర్మను పోలీసులు అడ్డుకుని విజయవాడ నుంచి హైదరాబాద్ తిప్పి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు సఫలం అయ్యారు. ఈ లోపు వర్మ నడిరోడ్డుపై మీడియా సమావేశం పెట్టేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. దీనిపై టీడీపీ అగ్రనేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఘాటుగా స్పందించారు.
వైసీపీ స్క్రిప్ట్, బీజేపీ ప్రొడక్షన్ లో సినిమా తీసిన వర్మ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్న సమయంలో వర్మ ఎవరి డైరక్షన్ లో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు? అంటూ మండిపడ్డారు. విజయవాడలో 144 సెక్షన్ ఉంటే ఎవరి పర్మిషన్ లేకుండా ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు కోడ్ పేరుతో అడ్డుచెబుతున్నారు, మరి సినిమాలకు కోడ్ వర్తించదా? అంటూ సీఎస్, ఈసీలను ప్రశ్నించారు.