కవిత మెడకు బిగుస్తున్న లిక్కర్ కేసు ఉచ్చు.. ఢిల్లీ వెళ్తే ఇక అరెస్టేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటివరకూ ఈ కేసులో సాక్షిగానే పరిగణించి విచారించిన సీబీఐ చార్జీషీటులో ఆమె పేరును నిందితురాలిగా పేర్కొనడం సంచలనంగా మారింది. సెక్షన్ 41 ఏ కింద కవితకు నోటీసులు జారీ చేస్తూ ఈనెల 26న తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈవిషయమై కవిత స్పందిస్తూ, నోటీసులు.. విచారణ తీరుపై సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగులో ఉన్నందున తాను విచారణకు హాజరు కాబోనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చేంతవరకు తాను సీబీఐ విచారణకు వెళ్లేదిలేదని తేల్చి చెప్పారు. ఈవిషయమై ఆమె రెండురోజులుగా న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ కవిత గడువు కోరే అవకాశం ఉందని వారంటున్నారు.

 

లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన మాగంటి రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లు ఇచ్చిన సమాచారం మేరకే సీబీఐ కవితకు తాజా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కవిత పీఏ కౌశిక్ న్యాయమూర్తి ముందు ఈ కేసుకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం అందింది. ఈ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందజేసినట్టుగా కౌశిక్ జడ్జి ఎదుట స్టేట్ మెంట్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కవితతో పాటు కౌశిక్ ని కూడా సీబీఐ నిందితులుగా పరిగణిస్తోంది.

 

ఈడీ కేసుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కవిత వేసిన కేసు ఈనెల 28న విచారణకు రానుంది. అప్పటి వరకూ కవిత సీబీఐ విచారణకు హాజరుకానని స్పష్టం చేయడంతో ఈ కేసులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆమె విచారణకు హాజరైతే.. సీబీఐ తాజాగా సేకరించిన సమాచారం మేరకు ఆమెను విచారించి అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆమె కోర్టును ఆశ్రయించడమే తక్షణ కర్తవ్యమని వారంటున్నారు. ఈవిషయంలో న్యాయనిపుణులు ఇచ్చే సలహా మేరకు కవిత ఏ స్టెప్ తీసుకుంటారో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

 

ఇదిలావుండగా ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈడీ వేటాడుతోంది. ఇప్పటికి ఆరుసార్లు విచారణకు రాకుండా డుమ్మా కొట్టారని, చర్యలకు ఆదేశించాలని ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సమన్లు అందుకున్న కేజ్రీవాల్ వీడియోకాల్ ద్వారా విచారణకు హాజరై మార్చి 16వ తేదీ వరకూ ఈకేసులో తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. కేజ్రీవాల్ ఇచ్చిన సమాచారంతో ఏకీభవించిన కోర్టు ఈకేసును మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. అయినప్పటికీ ఈడీ మళ్లీ 7వసారి సమన్లు జారీ చేస్తూ ఈనెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సీఎం కేజ్రీవాల్ కి కూడా 41 ఏ నోటీసులు జారీ చేసి అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *