వైసీపీకి భారీ షాక్.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా..!

వైసీపీకి భారీ షాక్ తగిలింది. నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణరాజు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు X వేదికగా తెలిపారు. రాజీనామాను సీఎం జగన్ మోహన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. తన రాజీనామా లెటర్ ను కూడా ఈ ట్వీట్ లో జత చేశారు.

 

శుక్రవారమే తాను పార్టీకి గుడ్ బై చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణరాజు. రాజీనామాకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నానని, ఒకట్రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తానని తెలిపారు. రాజీనామా చేస్తానని చెప్పిన మర్నాడే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి.. అందరినీ షాక్ కు గురి చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని, విపక్ష కూటమి నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కూడా వెల్లడించారాయన. అయితే ఏ పార్టీ టికెట్ పై బరిలో ఉంటారన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఫిబ్రవరి 28న టీడీపీ – జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో జరిగే భారీ బహిరంగ సభలోనూ పాల్గొంటానని తెలిపారు.

 

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణరాజుకు.. కొద్దిరోజులకే అధిష్టానం తీరు నచ్చక పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం జగన్ ప్రతి ఆలోచననూ ఆయన ఖండిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వైసీపీలోనే ఉంటూ.. రెబల్ ఎంపీగా వైసీపీ పై విమర్శలు గుప్పించారు. పార్టీ హైకమాండ్ తీరు నచ్చకపోవడంతో.. తొలి నుంచి తన వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు. చివరకు రాష్ట్రంలో వైసీపీ పాలనపై కేంద్రానికీ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపారు. దీంతో ఆయన్ను నియోజకవర్గంలో తిరగనివ్వమని వైసీపీ శ్రేణులు హెచ్చరించడంతో.. ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితమయ్యారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *