వారంలోనే రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్.. తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పారు. వారం రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్‌లో తొలిసారి ఆయన పర్యటించారు. రూ. 4,369 కోట్ల విలువైన 20 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

 

ఈ సందర్భంగా కోస్గిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. మార్చి 15న రైతుబంధు, రైతు భరోసా అమలు చేస్తామని తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. పాలమూరు గడ్డ నన్ను ఆదరించి, ఆశీర్వదించి అక్కున చేర్చుకుందని.. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్ేల సీఎం అయ్యానంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

మరోవైపు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగిందని రేవంత్ ఆరోపించారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే బీఆర్ఎస్అధినేత కేసీఆర్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇంకా యుద్ధం ముగియలేదని, ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చిందని అన్నారు.

 

పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు సీఎం రేవంత్. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్‌ గెలిచినట్లని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఇక్కడ్నుంచి ఎంపీగా గెలిచినా పాలమూరుకు కేసీఆర్ ఏమీ చేయలేదని విమర్శించారు.

 

తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్

 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏమి చేయలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *