వేమిరెడ్డి రాజీనామా, టీడీపీ నుంచి పోటీ..

వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. కొన్ని సీట్ల విషయంలో తాను సూచించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందుకు అనుగుణంగా మార్పులు చేయకపోవటంతో వేమిరెడ్డి పార్టీ వీడారు. తన రాజీనామా లేఖ పంపారు. టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్ది దాదాపు ఖరారయ్యారు.

 

వేమిరెడ్డి కోరిన విధంగా అభ్యర్దుల మార్పుకు అంగీకరించకపోవటంతో ఆయన పార్టీని వీడారు. నెల్లూరు సిటీ నుంచి ఖలీల్, కందుకూరు నుంచి తాను సూచించిన వారికి కాకుండా మరొకరికి సీటు ఇవ్వటం పైన వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. ఆయన సూచనల మేరకు టీడీపీలో అభ్యర్దుల మార్పుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ అభ్యర్ది ఎంపిక పైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.

 

ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. అయితే, వేమిరెడ్డి పార్టీ మారాలని నిర్ణయించటంతో ఎంపీగా తిరిగి ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదాల ను ఎంపీ అభ్యర్దిగా ఫిక్స్ చేస్తే నెల్లూరు రూరల్ నుంచి మాలెం సుధీర్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆదాలను నెల్లూరు రూరల్ లో కొనసాగిస్తే ఎంపీ అభ్యర్దులుగా దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్ల పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు ఎంపీ సీటు విషయంలో తుది నిర్ణయం తీసుకొనేందుకు నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే నెల్లూరు ఎంపీ అభ్యర్దిని సీఎం జగన్ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *