పొత్తు లెక్కలతో టీడీపీ అభ్యర్దుల స్థానాలు మార్పు..!

ఏపీలో పొత్తుల లెక్కలు ఇంకా తేలలేదు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ నుంచి అధికారికంగా స్పష్టత లేదు. టీడీపీ ఎన్డీఏలో చేరటం ఖాయమైనా..కార్యాచరణ మొదలు కాలేదు. ఇటు సీట్ల పంపకాల పైన టీడీపీ, జనసేన పైన ఒత్తిడి పెరుగుతోంది. మిత్రపక్షాలకు కేటాయించే సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన పార్టీ అభ్యర్దుల ఖరారు వేళ కొందరి స్థానాలు మార్పు చేస్తున్నారు. వచ్చే వారం జాబితా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

 

సీట్లు సర్దుబాటు:టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కీలకంగా మారుతోంది. టీడీపీ, జనసేనలో సీనియర్లకు త్యాగాలు తప్పవని ఇరు పార్టీల అధినేతలు చెబుతున్నారు. కానీ, సీనియర్ నేతలు మాత్రం సీట్లను వదులుకొనేందుకు సిద్దంగా లేరు. సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. దీంతో..పవన్ జిల్లాల పర్యటనలో పోటీ చేసే స్థానాల పైన స్పష్టత ఇస్తున్నారు. ఇటు చంద్రబాబు వైసీపీకి పట్టు ఉన్న రాయలసీమలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని ఈసారి అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేయించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఆయన గతంలో హిందూపురం ఎంపీగానూ పనిచేశారు.

అభ్యర్దుల ఖరారు:హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి బోయ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును పార్టీ పరిశీలిస్తోంది. అయితే, ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని కోరుతున్నారు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు అనిల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శింగనమలలో మహిళా నేత బండారు శ్రావణిని ఖరారు చేశారు. మిత్రపక్షాలతో పొత్తుల వల్ల ఈ జిల్లాలో మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం పెండింగ్‌లో పడింది. జనసేన ఈ జిల్లాలో పుట్టపర్తి లేదా అనంతపురం అర్బన్‌ సీటు ఇవ్వాలని అడుగుతోంది. బీజేపీ ధర్మవరం సీటును ఆశిస్తోంది. ఇక్కడ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలిచిన వరదాపురం సూరి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కదిరిలో ప్రస్తుత ఇన్‌చార్జి కందికుంట వెంకట ప్రసాద్‌ పోటీకి సంబంధించి కొన్ని న్యాయపరమైన అంశాలు తెరపైకి రావడంతో వాటిపై అధ్యయనం జరుగుతోంది.

 

కీలక నిర్ణయాలు:కల్యాణదుర్గంలో కొత్తగా తెరపైకి వచ్చిన పారిశ్రామికవేత్త సురేంద్రబాబుకు వ్యతిరేకంగా ఇద్దరు ప్రధాన పోటీదారులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గాలు ఏకమయ్యాయి.పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సీ) ఇన్‌చార్జిగా సొంగా రోషన్‌ కుమార్‌ను నియమించినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ప్రకటించారు. దళితుల్లో రెండు ఉప సామాజిక వర్గాలకు చెందిన డాక్టర్‌ అనిల్‌, రోషన్‌ ఇక్కడ పోటీపడ్డారు. వీరిలో రోషన్‌వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ సోదరుడు సురేశ్‌ కుటుంబం రేసులో ముందుకొచ్చింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో తొలుత మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినా.. స్థానిక పార్టీ నేత సైకం జయచంద్రారెడ్డి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి కాకర్ల సురేశ్‌ పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *