హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న గ్లోబరీనా సంస్థ వ్యవహారంపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వివరణ ఇచ్చారు. ప్రవేశాల నుంచి ఫలితాల వరకు ఒకే సాఫ్ట్‌వేర్ ఉండాలని భావించామన్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేయాలని కోరితే సీజీజీ స్పందించలేదని చెప్పారు. ఏజెన్సీ ఎంపికకు ప్రభుత్వ అనుమతితోనే ఈ-ప్రొక్యూర్‌మెంట్ చేపట్టినట్టు వెల్లడించారు. గ్లోబరీనా, మాగ్నటిక్ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయని, ఐటీశాఖ ఉద్యోగి సహా అధికారులతో కూడిన కమిటీ టెండర్లను ఖరారు చేసిందని వివరించారు. ప్రభుత్వ అనుమతి తీసుకున్నాకే గ్లోబరీనా సంస్థకు పని అప్పగించినట్టు చెప్పారు. మూడేళ్లలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసి బోర్డుకు అప్పగించాలనేది ఒప్పందమని, మూడేళ్ల తర్వాత ఇంటర్ బోర్డు సిబ్బందే ఆ సాఫ్ట్‌వేర్ నిర్వహించాలని యోచించామని వెల్లడించారు. 18 విద్యా సంస్థలకు పరీక్షల నిర్వహణ సాంకేతిక సేవలను గ్లోబరీనా సంస్థ అందించిందని అశోక్ తెలిపారు.