తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ధరణి పోర్టల్ గత ప్రభుత్వాన్ని గద్దె దించిందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తెలంగాణలో కొత్త సర్కార్ కొలువు దీరిన వెంటనే ధరణిపై కమిటీ వేసి ఎలాంటి లొసుగులు, లోపాలు ఉన్నయో బయటపెట్టాలని కోరింది.
తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ధరణి స్థానంలో కొత్త పోర్టల్ తీసుకొస్తామని తెలిపారు. తప్పుడు పత్రాలతో భూములు కాజేసిన భూబకాసురులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి హోదాలో పాల్గొన్న ఆయన ధరణిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి దరిద్రం అని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లోని లోపాలు, లొసుగుల వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.
ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ధరణి కేసులు వేలాదిగా ఉన్నాయన్నారు. సర్కారు భూములను కూడా పట్టా చేసుకున్నారని వాపోయారు. సీలింగ్ భూములను కూడా వదలకుండా పట్టా చేసుకున్నారి మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.