శ్రీకాకుళంపై ఫణి తుఫాను పెను ప్రభావం… భీకర గాలులతో భయంకర పరిస్థితులు….

 ఇప్పటికే తిత్లీ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను ఫణి తుఫాను కూడా సర్వనాశనం చేస్తోంది.

ఫణి తుఫాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ గురువారం సాయంత్రం నుంచీ భీకర గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాపై తీవ్ర తుఫాను ఫణి పెను ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం అక్కడ గాలుల వేగం గంటకు 190 నుంచీ 200 కిలోమీటర్లుగా ఉంది. తుఫాను తీరం దాటేటప్పుడు గాలుల వేగంగా గంటకు 220 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం హెచ్చరికలతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికీ తిత్లీ తుఫాను నష్టం నుంచి బయటపడని శ్రీకాకుళం జిల్లాకు ఫణి తుఫాను మరింత ఎక్కువ నష్టం కలిగించేలా ఉంది. తిత్లీ తుపానుతో ఆరు నెలలుగా అష్టకష్టాలు పడుతున్న ఉద్దానం ప్రాంతంపైనే మళ్ళీ ఫని తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
తీర ప్రాంతంలో పెద్దఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. రెండున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరాన్ని తాకుతున్నాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఒడిశా లోతట్టు ప్రాంతాల్లో భారీగా అలలు ఎగసిపడడంతో గంజాం, ఖుర్దా, పూరీ, జగన్‌సింగ్‌పూర్ జిల్లాల్లో అలల ఉద్ధృతి ఎక్కువైంది. భారీ వర్షాల కారణంగా ఒడిశా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా నదీపరివాహక ప్రాంతాల్లో గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. నదులు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

ప్రమాదకరంగా ఉన్న భవనాలు, కచ్చా ఇళ్ళల్లో ఉండకుండా ప్రజలను అప్రమత్తం చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉద్దాన ప్రాంతానికి చెందిన ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, మందస, నందిగాం, పలాస, సోంపేట, సంతబొమ్మాళి మండలాల్లో గురువారం సాయంత్రం నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 126 పునరావాస కేంద్రాలకు 19,129 మందిని తరలించి భోజన, ఇతర వసతి ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఫణి తుఫాను తీవ్రత వల్ల భారత రైల్వేశాఖ ఒడిశా నుంచి శ్రీకాకుళం మీదుగా నడిచే 23 రైళ్ళ రాకపోకలను నిలిపివేసింది. వజ్రపుకొత్తూరు, ఆమదాలవలస మండలాల్లో ఈదురుగాలులకు విద్యుత్‌వైర్లు తెగిపడిపోయాయి. పూడిలంక ప్రాంతానికి తుపాను తీవ్రరూపం ఇంకా దాల్చకుండానే ఆ ప్రాంత ప్రజలకు బాహ్యప్రపంచంతో కమ్యూనికేషన్లు తెగిపోయాయి. ఆ గ్రామం వారథి పూర్తిగా నీట మునిగిపోయింది. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అంతా చీకటి అలుముకుంది. భారీ ఈదురుగాలలు కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల 33 కె.వి.లైన్లు గల సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో పలు ప్రాంతాలు కారుచీకటిగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *