అంతర్జాతీయం : ప్రపంచంలో ఏ వస్తువు ధరైనా గిరాకీ–సరఫరా(డిమాండ్–సప్లయ్) ఆధారంగానే నిర్దేశితమవుతుంది. ఒక్కసారిగా డిమాండ్ ఆవిరై.. సరఫరా అదే స్థాయిలో కొనసాగితే ధర కుప్పకూలక తప్పదు. క్రూడ్ విషయంలోనూ ఇదే జరిగింది. అమెరికాలో ఉత్పత్తి అయ్యే లైట్ స్వీట్ క్రూడ్(డబ్ల్యూటీఐ–వెస్ట్రన్ టెక్సాస్ ఇంటర్మీడియెట్) మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టు బ్యారెల్ ధర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం మైనస్‌లోకి జారిపోయింది.
ఒకానొక దశలో క్రితం ముగింపు 18.27 డాలర్లతో పోలిస్తే ఏకంగా 307 శాతం కుప్పకూలి… మైనస్ 40.32 డాలర్లను తాకింది. చివరికి 280% నష్టంతో(55.9 డాలర్లు కోల్పోయి) మైనస్ 37.63 వద్ద ముగిసింది. అయితే, మంగళవారం ఈ కాంట్రాక్టు ధర 125 శాతం పైగా కోలుకొని 9.5 డాలర్లను తాకి ట్రేడవుతోంది. ఈ మే నెల కాంట్రాక్టు గడువు మంగళవారంతో ముగుస్తుంది. అంటే నేటి నుంచి జూన్ కాంట్రాక్టు ధరను క్రూడ్ ఫ్యూచర్స్ ప్రామాణిక రేటుగా పరిగణిస్తారన్నమాట! ఇది కూడా సోమవారం 17%పైగా కుప్పకూలి 20 డాలర్ల స్థాయిని తాకింది. మంగళవారం ఇది 67 శాతం క్షీణించి 6.5 డాలర్ల కనిష్టాన్ని చవిచూసింది.