హైదరాబాద్ : విద్యార్థినులు, యువతులు, ఉద్యోగినుల వెంటపడుతున్న 38 మంది ఆకతాయిలను నెల రోజుల వ్యవధిలో అరెస్టు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై 53 కేసులను నమోదు చేశారు. అందులో 33 ఎఫ్‌ఐఆర్‌లు, 16 పెట్టీ కేసులు, 4 కౌన్సెలింగ్ కేసులను బుక్ చేశారు. వీటిలో 33 మంది మేజర్లు, ఐదుగురు మైనర్లను అరెస్టు చేశారు. భూమిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతోపాటు మానసిక నిపుణులతో పట్టుబడ్డ వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్ నమోదు చేసిన కేసుల్లో పలు ముఖ్యమైన సంఘటనల వివరాలిలా ఉన్నాయి.
భువనగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్ చదువుతున్నది. ఆరు నెలలుగా ఆ విద్యార్థినిని భువనగిరి కళాశాలకు వెళ్లే సమయంలో వెంటపడుతూ ప్రేమించమని వేధించడంతోపాటు పెండ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. గత నెల 4వ తేదీన కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థినిని రోడ్డుపై అటకాయించి ఆమె చేతులు పట్టుకుని అవమానించి కించపర్చాడు. అసభ్యపదజాలంతో దూషించాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు ఇవ్వడంతో భవనగిరి టౌన్ పీఎస్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ బొంతుల రామకిరణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఐ లైక్ యూ సో మచ్.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. తిరస్కరిస్తే మీ తల్లిదండ్రులను చంపేస్తాను. అంటూ బెదిరిస్తున్న సాంబశివరావుపై ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగిని నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ
కూతుర్ని వేధించవద్దని పలు మార్లు యువతి తల్లిదండ్రులు నిలదీసినా, విజ్ఞప్తి చేసినా సాంబశివరావు తన వైఖరిని మార్చుకోలేదు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు సాంబశివరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రాంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ ఓ యువతితో 18 నెలలపాటు ప్రేమాయణం నడిపించాడు. అతని మాయమాటలతో ఇంట్లో ఎవరులేని సమయంలో ఇంటికి పిలిపించుకొని సన్నిహితంగా గడిపాడు. గోవా, శ్రీశైలం ప్రాంతాలకు తీసుకువెళ్లి యువతిని శారీరకంగా వాడుకున్నాడు. యువతి పెండ్లీ చేసుకోమని అడిగినప్పుడల్లా దూరం పెడుతూ ఓ రోజు తనకు వేరే యువతితో వివాహం జరుగుతుందని తేల్చి చెప్పాడు. బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో రాజశేఖర్‌ను కీసర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భువనగిరి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి షీ టీమ్స్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి పలువురు పోకిరీలను అరెస్టు చేశారు. ఐదు బాల్య వివాహాలను నివారించారు. దీంతో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది మైనర్ బాలికలను బాల్య వివాహాల నుంచి కాపాడారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు భయం, ఆందోళన లేకుండా ముందుకు వచ్చి పోకిరీలు, ఆకతాయిలపై ఫిర్యాదు చేయాలని సీపీ మహేశ్‌భగవత్ కోరుతున్నారు. డయల్ 100, వాట్సాప్ నంబరు 94906 17111కు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.