రైతులతో నేడు నాలుగో దఫా చర్చలు.. డిమాండ్లు నెరవేరుతాయా..?

దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన పోరాటం నేడు ఆరవ రోజుకు చేరుకుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈనెల 13న ‘ఢిల్లీ ఛలో’ నినాదంతో రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో సుమారు 200 రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఆందోళనలో భాగంగా ఢిల్లీని ముట్టడించేందుకు యత్నించిన రైతులను తరిమికొట్టేందుకు కేంద్ర భద్రతా బలగాలు డ్రోన్లతో భాష్పవాయు గోళాలను ప్రయోగించి బీభత్సం సృష్టించాయి.

 

ఈ దాడులలో పలువురు రైతులు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. అయినప్పటికీ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా వెనుకంజ వేసే ప్రసక్తేలేదని పట్టుబట్టారు.దీంతో కేంద్రప్రభుత్వం దిగివచ్చి రైతు సంఘాల ప్రతినిధులతో ఇప్పటికి మూడుసార్లు చర్చలు జరిపింది. నేడు నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి.

 

నేడు జరుగనున్న నాలుగో దఫా చర్చల్లో కేంద్రప్రభుత్వం నుంచి తమకు సానుకూల పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో అన్నదాతలు ఉన్నారు. ఈనెల 8, 12, 15వ తేదీలలో జరిగిన చర్చల్లో ఎటువంటి విధాన నిర్ణయాలను మంత్రులు ప్రకటించలేదు. అయితే గురువారం చండీగఢ్ లో రేయింబవళ్లు జరిగిన సుదీర్ఘ చర్చలో అన్ని డిమాండ్లపై కేంద్రమంత్రులు కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రైతు ప్రతినిధులకు తెలిపారు. దీంతో ఈరోజు జరగనున్న చర్చలు కీలకం కానున్నాయి. కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ నేడు జరిగే నాలుగో దఫా చర్చల్లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.

 

మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం. 70 శాతం మందికి పైగా వ్యవసాయమే జీవన ఆధారంగా బతుకుతున్నారు. అప్పోసొప్పో చేసి కష్టపడి పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు ఎప్పటినుంచో కోరుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాతలు మాత్రం మారడంలేదు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. చేసిన అప్పులు తీర్చే దారిలేక నేటికీ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో దేశంలోని రైతు సంఘాలన్నీ ఏకమై 2020-2021లో ఉవ్వెత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఢిల్లీని వేలాదిమంది రైతులు ముట్టడించి కేంద్రప్రభుత్వ తీరుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏడాదిపాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటంలో 700 మందికిపైగా రైతులు మరణించారు. ఈపోరాటం ఫలితంగా ఎన్డీయే ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసింది. అప్పటినుంచి తమ డిమాండ్లు అపరిష్కృతంగానే మిగిలిపోవడంతో నేడు మళ్లీ రైతాంగానికి పోరుబాటే శరణ్యమైంది. మళ్లీ ఇప్పుడు కూడా 2021 నాటి పరిస్థితులే పునరావృతమవుతాయా అనే సందేహం ప్రజలను వేధిస్తోంది.

 

దేశాన్ని ముంచేసి పారిపోయే ఆర్ధిక నేరగాళ్లకు లభిస్తున్న వెసులు బాటు దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతాంగానికి లేదని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాంకులను వేలకోట్లలో దగాచేసినవారి రుణాలను మాఫీ చేస్తున్నారుగానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవడంలేదని వారు ఆక్రోషిస్తున్నారు. దేశ ద్రోహులను క్షమించేసి.. అన్నదాతలను శత్రువులుగా చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రైతుల రక్షణకు అవసరమైన ప్రధాన డిమాండ్లను అంగీకరించే వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని వారు తేల్చి చెప్పారు. ఆరునెలల పోరాటానికి అవసరమైన ఆహారసామాగ్రితో తాము కదనరంగంలో కాలుమోపామని అంటున్నారు. శాంతియుతంగా పోరాటం చేయడానికి అనుమతించాలని కోరుతున్నారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం జోక్యం చేసుకుని రైతుల డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయాలని రైతునేత శర్వాన్ సింగ్ పంథేర్ డిమాండ్ చేశారు. ఆదివారం జరిగే చర్చల అనంతరం ప్రధాని రైతులనుద్దేశించి ప్రసంగిస్తారని, శుభవార్త చెప్తారని తాము ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతే రైతు సమస్యలకు పరిష్కారమని శర్వాన్ సింగ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *