సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడ్డారు. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. కోర్టు నుంచి నోటీసులనూ అందుకున్నారు. విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడిందాయనకు.
వలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలను పవన్ కల్యాణ్ ఎదుర్కొంటోన్నవిషయం తెలిసిందే. గత ఏడాది ఏలూరులో నిర్వహించిన వారాహి విజయయాత్ర సందర్భంగా ఆయన- వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమాచారం సేకరిస్తోందంటూ ఆరోపించారు.
ఒంటరి మహిళలను వలంటీర్లు కిడ్నాప్ చేస్తోన్నారని, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు ఈ సమాచారం అందిందంటూ ఆ సభలో పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, దీనికి కారణం వలంటీర్లేనంటూ విమర్శించారు.
ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయనపై గుంటూరు న్యాయస్థానంలో పిటీషన్లను దాఖలు చేసింది. దీనికి సాక్ష్యంగా మీడియాలో ప్రసారమైన వీడియోలు, దినపత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను ఈ పిటీషన్‌కు జత చేసింది. కొందరు వలంటీర్ల వాంగ్మూలాలనూ న్యాయస్థానానికి సమర్పించింది.
వాటన్నింటినీ పరిశీలించిన తరువాత ఈ పిటీషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. ఐపీసీ 499, 500, సెక్షన్ల కింద పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. మార్చి 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నోటీసులను ఇచ్చింది. ఈ మేరకు గుంటూరు ఫోర్త్ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ శరత్‌బాబు ఈ నోటీసులను జారీ చేశారు.