శ్రీలంక బాంబు పేలుళ్ల కవరేజీకి వెళ్లిన ఓ భారత జర్నలిస్ట్ కటకటాల పాలయ్యాడు. అక్కడి నిబంధనలు తెలుసుకోకుండా కవరేజీ చేసి ఇరుక్కుపోయాడు. అనుమతి లేకుండా స్కూళ్లోకి ప్రవేశించినందుకు శ్రీలంక పోలీసులు అతడిని అరెస్ట్ చేసి నెగంబో కోర్టులో ప్రవేశపెట్టారు. మే 15 వరకు అతడికి రిమాండ్ విధించింది కోర్టు. ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ సిద్దిఖీ అహ్మద్ డానిష్ రాయిటర్స్ ఇండియా సంస్థలో పనిస్తున్నాడు. నిబంధనలను ఉల్లంఘించి ఓ స్కూళ్లోకి వెళ్లినందుకు అతడిని లంక పోలీసులు అరెస్ట్ చేశారు. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన బాంబు పేలుళ్లలో ఓ విద్యార్థి చనిపోయాడు. అతడి తల్లిదండ్రులు స్కూళ్లో ఉన్నారని తెలుసుకున్న సిద్దిఖీ వారిని ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లాడు. ఐతే ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నేరుగా స్కూల్ లోపలికి వెళ్లిపోవడంతో అతడిపై పోలీసులు కేసునమోదు చేసి అరెస్ట్ చేశారు.
శ్రీలంకలో ఏప్రిల్ 26 ఈస్టర్ రోజు బాంబు పేలుళ్లు జరిగాయి. పలు చర్చిలు, హోటళ్లలో వరుస పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించారు టెర్రరిస్టులు. ఉగ్రదాడిలో దాదాపు 260 మంది చనిపోగా…వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది చేతులు, కాళ్లు కోల్పోయి నరకయాతన అనుభవిస్తున్నారు.