బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు..–;మల్లారెడ్డి

లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇరుపార్టీల నేతలు స్పందిస్తున్నారు. తాజాగా, బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే.. మా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు.

 

బండి సంజయ్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదన్నారు మల్లారెడ్డి. మల్కాజిగిరి టికెట్ భద్రంగా ఉందన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉన్నా.. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. మా అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు.. మా కుటుంబం వేరని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తమ కుమారుడికి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ యూనివర్సిటీలో అక్రమ కట్టడాలు ఉంటే.. ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే తాను ఏం చేయలేనని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

 

 

బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తుపై బండి సంజయ్ ఏమన్నారంటే?

 

ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ ఎన్డీఏలో చేరతామని అడిగితేనే చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో తాము 17కి 17 ఎంపీ సీట్లు గెలుస్తామని.. దేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలిచే అవకాశం లేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులే లేరి, ఉన్నవాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమాలుతున్నారని చెప్పారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీశ్ రావుతో సహా ఎవరైనా బీజేపీలోకి వస్తామంటే ఆహ్వానిస్తామన్నారు.

 

బీఆర్ఎస్, కాంగ్రెస్ కు అవగాహన ఒప్పందం ఉందన్నారు. అందుకే బీఆర్ఎస్ స్కాంలు బయటపడుతున్నా.. కాంగ్రెస్ సర్కారు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలో లాగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *