రాజకీయ పార్టీలకు సుప్రీం బిగ్ షాక్- ఎన్నికల బాండ్ల పథకం రద్దు- కీలక తీర్పు.. |

దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్దమవుతున్న రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటివరకూ ఎన్నికలకు నిధుల సేకరణకు వాడుకుంటున్న ఎన్నికల బాండ్ల జారీ పథకం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేంది. ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వీటిని చట్ట విరుద్దంగా ప్రకటించింది. ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా సేకరించిన విరాళాల వివరాలు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇచ్చింది.

 

 

రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చే విరాళాలకు పారదర్శకత తెచ్చేందుకు వీలుగా 2018లో ఎలక్ట్రోరల్ బాండ్ల పథకం అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీలు తమకు విరాళాలు ఇచ్చే వారికి ఈ బాండ్లు జారీ చేయడం ద్వారా విరాళాలు సేకరించుకునే అవకాశం ఇచ్చారు. ఈసీ అనుమతించిన మేరకు ఇలా ఎన్నికల బాండ్లు జారీ చేసి విరాళాలు సేకరించుకునే అవకాశం ఉంది. అయితే దీని చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మానం విచారణ జరిపి ఇవాళ తీర్పు ప్రకటించింది.

 

దేశంలో ఎన్నికల బాండ్ల జారీని తక్షణం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇది దేశంలో పౌరులకు ఉన్న సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని సుప్రీం అభిప్రాయపడింది. అలాగే క్విడ్ ప్రోకోకు కూడా అవకాశం ఇస్తుందని తెలిపింది. దీంతో పాటు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపేయాలని వీటి ఆధీకృత బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ను ఆదేశించింది. ఇప్పటివరకూ జారీ చేసిన బాండ్లు,వాటిద్వారా వచ్చిన విరాళాల వివరాలు కూడా కోరింది.

 

రాజకీయ పార్టీలకు అందే ప్రతీ విరాళం ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయదని, అలాగే విద్యార్దులు, రోజువారీ కూలీలు కూడా విరాళాలు అందిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే కొన్ని విరాళాలు ఇతర ప్రయోజనాల సేకరిస్తున్నారన్న కారణంతో వీటిని గోప్యంగా ఉంచలేమని పేర్కొంది. వ్యక్తుల నుంచి అందే విరాళాల కంటే కంపెనీల విరాళాలు పూర్తిగా వ్యాపార లావాదేవీలేని స్పష్టం చేసింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ల పథకం ఒక్కటే ప్రత్యామ్నాయం కాదని కూడా తేల్చిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *