ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచి ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభలతో సన్నద్ధం అవుతుంటే, టీడీపీ వరుస సభలను నిర్వహిస్తుంది. ప్రస్తుతం నారా లోకేష్ శంఖారావం పేరుతో యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఇక ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు సిద్ధం కాగా ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు కాగా, నిన్న పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించవలసి ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో ప్రయాణం చేయనున్న క్రమంలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతులు నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడింది. ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని జనసేన నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా తన ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జిల్లాలోని జనసేన ముఖ్య నేతలను మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయానికి రావాలని పిలిపించుకొని, వరుస సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో సమావేశాలను నిర్వహించనున్నారు.
భీమవరం, కాకినాడ, అమలాపురం రాజమండ్రి లో నిర్వహించవలసిన సమావేశాలను పవన్ కళ్యాణ్ నేటినుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడుతున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాలలో ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్ళాలి, టీడీపీ నేతలతో ఏ విధంగా కో ఆర్డినేట్ చేసుకోవాలి వంటి అంశాలతో పాటు అభ్యర్థుల ఎంపిక పైన కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టనున్నారు. ఈ సమావేశాల అనంతరం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి పవన్ రూట్ మ్యాప్ ఖరారు కానున్నట్టు తెలుస్తుంది.