ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని కామేపల్లి మండల గోవింద్రాల గ్రామానికి వెళ్లిన హరిప్రియ నాయక్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
టీఆర్ఎస్‌లో చేరిన ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని కామేపల్లి మండల గోవింద్రాల గ్రామానికి వెళ్లిన హరిప్రియ నాయక్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్‌లో ఎలా చేరతారని ప్రశ్నించారు. పార్టీ మారాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు… ఇరువర్గాలను చెదరగొట్టారు. రాళ్ల దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మొత్తం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించగా… వారిలో నలుగురు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన హరిప్రియ నాయక్‌కు కామేపల్లి మండలంలోనే మంచి మెజార్టీ రావడం గమనార్హం.