దిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన దిల్లీలో శనివారం ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ”ఆప్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నేను ఆప్ కార్యకర్తని కాకపోయినప్పటికీ..ఆ పార్టీ విధానాలతో సంతృప్తి చెందిన సామాన్యుల్లో నేనూ ఒకడిని. వ్యవస్థలో మార్పులకు ప్రయత్నిస్తున్న ఆప్‌లాంటి పార్టీలు దేశానికి ఎంతో అవసరం” అని ప్రకాశ్ అభిప్రాయపడ్డారు. తనకు మోదీకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం కొన్ని విషయాల్లో వారు అనుసరిస్తున్న విధానాలకే తాను వ్యతిరేకమన్నారు. మోదీ పేరు చెప్పుకొని కొంత మంది భాజపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ప్రశ్నిస్తే తిరిగి సమాధానంగా ప్రశ్నే వస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలన్నారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాల్లో ఏ ఒక్క పార్టీకి ఈసారి మెజార్టీ రాదన్న ప్రకాశ్‌రాజ్ ఆ రెండు పార్టీలను కేంద్రం నుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను ఉద్దేశిస్తూ.. మోదీ ఓ ఎన్‌ఆర్‌ఐ అని.. కేవలం ఎన్నికల సమయంలోనే దేశంలో పర్యటిస్తారని ఎద్దేవా చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వాళ్లు మోదీ బలంతో నేతలుగా ఎదుగుతున్నారని.. బాబ్రీ మసీదు కూల్చివేతలో తానూ ఉన్నానని ఆమె వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాగా.. ఏడు లోక్‌సభ స్థానాలున్న దిల్లీలో మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి ప్రకాశ్‌రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.