హైదరాబాద్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ ఫలితాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి కొనసాగుతోందని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. ఈ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సెలవుల్లో ఉన్న లెక్చరర్లతో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయిస్తున్నామని, ఈ ప్రక్రియ 12 సెంటర్‌లలో కొనసాగుతోందని తెలిపారు.
లెక్చరర్ల మూల్యాంకనం డేటా నేరుగా ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుతోందని అశోక్ చెప్పారు. ఆ డేటాను ప్రాసెసింగ్ చేసే బాధ్యత త్రిసభ్య కమిటీ సూచన మేరకు కొత్తగా ఒక కంప్యూటర్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించామని వెల్లడించారు. త్రిసభ్య కమిటీ సూచన మేరకు నోయిడాకు చెందిన డాటా మేతోడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ… ఇంటర్ విద్యార్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ డేటాను ప్రాసెసింగ్ చేస్తుందని అశోక్ తెలిపారు.
కొత్త సంస్థతో పాటు గ్లోబరీనా సంస్థ కూడా సమాంతరంగా ప్రాసెసింగ్ చేస్తుందని చెప్పారు. రెండింటినీ పరిశీలించి సరిగ్గా ఉన్నాయని నిర్ణయించుకున్నాకే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఆ రెండు సంస్థలు ప్రాసెసింగ్ చేసిన డేటా విశ్లేషణ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, జేఎన్‌టీయూహెచ్‌ల పర్యవేక్షణలో జరుగుతుందని అశోక్ స్పష్టం చేశారు.