అసెంబ్లీలో కేసీఆర్‌ హాజరుపై ఉత్కంఠ..

తెలంగాణలో వాటర్‌ ఫైట్ తో పొలిటికల్‌ వేడి సెగలు కక్కుతోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ బాస్‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌గా హస్తం నేతలు అవినీతి ఆరోపణలు చేస్తూ.. అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు తెలంగాణను పాలించి.. అధికార చక్రం తిప్పిన గులాబీ బాస్‌.. ప్రతిపక్ష నేతగా సభలోకి అడుగు పెడతారా అన్న ఉత్కంఠ నెలకొంది.

 

10 ఏళ్ల పాలనలో తన మాటకు తిరుగులేదనిపించుకున్న కేసీఆర్‌.. ప్రతిపక్ష నేతగా శాసనసభకు హాజరవడానికి అయిష్టంగా ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఎందుకంటే.. తనకు ముందులా గౌరవం దక్కదేమోనన్న కారణం ఒకటైతే.. తాను మాట్లాడుతున్నప్పుడు సీఎం, మంత్రులు అడ్డుతగిలి కౌంటర్లు ఇస్తే, తనకు అవమానకరమని కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. తనకెవరూ ఎదురు చెప్పే పరిస్థితి లేదన్న రేంజ్‌లో ఉన్న కేసీఆర్‌.. ఓటమి తర్వాత తన జోరును, పంథాను తగ్గించుకోవాల్సిన పరిస్థితి సభలో ఏర్పడుతుంది. ఈ కారణాలతోనే గులాబీ బాస్‌ సభకు మొఖం చూపించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది.

 

మొన్నటి వరకూ అనారోగ్య కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కేసీఆర్‌.. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. కోలుకున్నాక కూడా అసెంబ్లీకి హాజరుకాకుండా.. తాను చెప్పాల్సింది మొత్తం నల్గొండ సభా వేదికగా ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే అధికార పార్టీ నేతల విమర్శలకు కూడా కౌంటర్‌ ఇచ్చారు. శాసనసభకు వెళ్లే ఇష్టం లేదు కాబట్టే.. తాను మాట్లాడేటప్పుడు ఎవరూ అడ్డుతగిలే పరిస్థితి ఉండదనే.. నల్గొండ సభలో కేసీఆర్‌ నోటికొచ్చినట్లు మాట్లాడారన్న టాక్‌ వినిపిస్తోంది.

 

నల్గొండ సభపై సీఎం రేవంత్‌రెడ్డి సహా హస్తం నేతలంతా ఫైర్‌ అయ్యారు. కాలు విరిగితే అసెంబ్లీకి రాని కేసీఆర్‌.. నల్లగొండకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. సమస్యలను పక్కదారి పట్టించే కుట్ర చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టులపై చర్చిస్తుంటే కేసీఆర్‌ భయపడిపోతున్నారని.. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకే నల్గొండలో సభను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి.. ప్రతిపక్షనేతగా తన బాధ్యత నిర్వర్తించాలని కోరారు. మరి ఇప్పటికైనా కేసీఆర్‌ అసెంబ్లీలో అడుగు పెడతారో లేదో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *