ప్రజలకోసం మాజీ ఐఏఎస్ పాదయాత్ర…

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కొత్త అభ్యర్థులు సైతం తెరపైకి వస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆ రిటైర్డ్ ఐఏఎస్ స్పెషల్‌గా కనిపిస్తున్నారు. సీనియర్ అధికారిగా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి.. ప్రజాసేవలో తనదైన మార్క్ చూపించిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలేసాక కూడా అణగారిణ వర్గాల సేవకే అంకితమై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. ఎవరా స్పెషల్ ఆఫీసర్? అసలు ఆయన లక్ష్యమేంటంటారా?

 

సీనియర్ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్‌కేఆర్ విజయ్ కుమార్.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించిన ఆఫీసర్.. విద్యాశాఖతోపాటు అనేక శాఖల్లో పనిచేసి తనదైన ముద్ర వేసుకోగలిగారు.

 

ఎస్సీ వర్గానికి చెందిన విజయ్ కుమార్ నెల్లూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాలకు కలెక్టర్‌గా గతంలో పనిచేసినప్పుడు ప్రజాసేవలో తనదైన మార్క్ చూపించారు. విధులకు దూరమయ్యాక కూడా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకుని.. ఆయా వర్గాలకు దగ్గరవుతూ అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ మాజీ ఐఏఎస్.

 

సంపద సృష్టించకుండా పేదరిక నిర్మూలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్న విజయ్‌కుమార్.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఐక్యతా విజయపథంతో పేరుతో పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నారు. గతేడాది జులై 23న తిరుపతి జిల్లా తడ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విజయ్‌కుమార్‌ కాకినాడ జిల్లా తుని వరకు 2,729 కిలోమీటర్ల మేర నడిచారు. 147 రోజుల్లో 1250 గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి లక్షల మందిని కలిసి నిరుపేదల సమస్యలపై అధ్యయనం చేశారు.

 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైందంటున్న మాజీ ఐఏఎస్.. వారి అభ్యున్నతి కోసం పోరాటానికి సిద్దమయ్యారు. అందులో భాగంగా లక్ష మందితో ఈ నెల 14న గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సీటీ ఎదుట..‘అధిక జనుల మహాసంకల్పసభ’ నిర్వహించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఐఏఎస్‌గా విధులు నిర్వహించినప్పుడు సైతం పేదల పక్షపాతి పేరు గడించిన విజయ్‌కుమార్.. మాజీ అయ్యాక కూడా వారి శ్రేయస్సు కోసం పరితపిస్తుండటం అందర్నీ ఆకర్షిస్తూ.. ఆలోచింప చేస్తోందంట.. తన యాత్రలో గమనించిన పరిస్థితులపై తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాల్లోని పేదలపై జరుగుతున్న దమనకాండ, అణచివేత పరిస్థితులను గతంలో తానెప్పుడూ చూడలేదని విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. గత అయిదేళ్లలో సంక్షేమం కోసం 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశానంటున్న పాలకులు.. నిజమైన పేదలకు ఒరగపెట్టిందేమీ లేదని తన పాదయాత్రతో తెలుసుకున్నానని చెప్పుకొస్తున్నారంట.

 

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల పేదలకు స్వేచ్ఛ కరవైందని, తాము కోల్పోయిన వాటిని కూడా ధైర్యంగా అడగలేకపోతున్నారని.. మధనపడుతున్న విజయ్‌కుమార్‌ వారికి నిజమైన సంక్షేమం అందించాలన్న పట్టుదలతో ఉన్నారంటున్నారు. పాదయాత్ర పొడవునా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన.. ఆయా సమస్యలను బహిరంగంగా వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా వారికి లేకుండా పోయిందన్న అభిప్రాయంతో ఉన్నారంట.

 

విజయ్‌కుమార్ పేదల సమస్యలను తెలుసుకోవడానికి వారి మధ్యకు వెళ్తే.. ఎక్కడికక్కడ ఆయనకు సమాధానం లేని ప్రశ్నలే ఎదురయ్యాయంట. ఈ ప్రభుత్వం తమ కోసం ప్రత్యేకంగా ఏం చేసిందని ప్రతిచోటా ఎస్సీ వర్గాలు ప్రశ్నించాయంట. గతంలో ఉన్న పథకాలన్నీ తొలగించారని వారంతా వాపోయారంట. వాస్తవ పరిస్థితులు చూస్తే అది నిజమే అనిపిస్తుందని విజయకుమార్ అంటున్నారంట. ఎస్సీల పిల్లలు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకున్నా గత ప్రభుత్వాలు ఉపకార వేతనాలు ఇచ్చేవి.. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకే ఇస్తున్నారు. పేదలకు చదువులు దూరం చేస్తున్నారు. విద్యార్థికి చేరువగా బడులు ఉండాలన్న ఐక్యా రాజ్య సమితి లక్ష్యాన్ని పక్కనపెట్టి .. కానీ, ఏపీలో స్కూళ్లు మూసేస్తూ.. విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తున్నారని విజయ్‌కుమార్ తరచూ అంటుంటారంట.

 

ప్రతి ఊరిలోనూ విచ్చలవిడిగా మత్తు పదార్థాలు దొరుకుతుండటంతో.. యువత వాటికి బానిసలవుతున్నారు. ప్రభుత్వం మత్తు పదార్థాల వాడకాన్ని అరికట్టలేకపోతోంది. ఉపాధి దొరక్క మత్తుకు బానిసై యువత నిర్వీర్యమైపోతూ.. ఒక తరాన్ని కోల్పోతున్నామని.. అందుకే డ్రగ్స్‌పై యుద్ధానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేసే పనిలో ఉన్నారంట మాజీ ఐఏఎస్.

 

గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా పేద యువతకు ఇన్నోవా కార్లు రాయితీపై అందించింది. వారు నెలకు 15 వేలకుపైగా సంపాదిస్తున్నారు. ప్రస్తు ప్రభుత్వం అలాంటి పథకాలను ఎందుకు రద్దు చేసిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలు తీసుకోకపోవడంతో.. మళ్లీ వారు బానిసలుగా, పాలేర్లుగా మారిపోతున్నారన్నది విజయ్‌కుమార్ ఆవేదన. అలాగే చదువుకున్న మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాల్లేవు. స్వయం ఉపాధికి ఆర్థికంగా చేయూతనిచ్చి, తమ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నా పట్టించుకోక పోవడంతో వారు వలసలు పోవాల్సి వస్తుందని.. ఆ దుస్థితిని రూపమాపడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.

 

తాను కలెక్టర్‌గా పని చేసినప్పుడు ఎవరైనా సమస్యలతో వస్తే, పరిష్కరించడంపై దృష్టి పెట్టేవాళ్లమని.. ఇప్పుడు ఏ ఊరిలో చూసినా హృదయ విదారక పరిస్థితులున్నాయని ఆయన వాపోతున్నారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం దగ్గర అన్నెపూడిలో దశాబ్దాలుగా ఎస్టీలు చెరువులో చేపలు పట్టుకొని బతికేవారు.. ఇప్పుడు అక్కడి పెత్తందారులు వారిని చేపలు పట్టుకోనివ్వడం లేదు. రేషన్‌కార్డులు పేదలకు ఇవ్వకపోగా కార్లలో తిరిగేవారికి ఇస్తున్నారు. ఇలాంటి సమస్యలన్ని పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చాయంట.

 

అలాగే రాష్ట్రంలో రోడ్లు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాయో గుర్తించారంట. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల ద్వారా వారి ఆవాసాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటికల వంటి మౌలిక వసతులు కల్పించాలి. కానీ ఏపీలో ఆ ఊసే లేదు. ఆరోగ్యం దెబ్బతింటే చికిత్స చేయించుకోలేక పేదలు అప్పుల పాలవుతున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో 60 వేలు, పట్టణాల్లో 1.20 లక్షలు ఉంటేనే పేదరికం నుంచి బయటపడినట్లు. ఇవేమీ లేకుండా… ఏ ప్రాతిపదికన రాష్ట్రంలో పేదరికం తగ్గిందని ప్రస్తుత పాలకులు చెప్తున్నారని విజయ్‌కుమార్ ప్రశ్నిస్తున్నారు.. ఆదాయ కల్పన లేకుండా, ఆస్తులు సృష్టించకుండా పేదరికాన్ని ఎలా తగ్గిస్తారంటున్న.. విజయ్‌కుమార్ పాదయాత్రలో మొత్తం 16 వేల అర్జీలు వస్తే.. వాటిలో, ఇళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *