17వ లోక్ సభ చివరి సమావేశం.. నరేంద్ర మోడీ చెప్పిన కీలక అంశాలివే..

వినే టైం, చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. అరవింద సమేత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పలికే డైలాగ్ అది. ఆ డైలాగ్ ను శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు అర్థమయ్యేలా చెప్పారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శనివారం లోక్ సభ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెలరేగిపోయారు. ప్రతిపక్షాలను ఆట ఆడుకున్నారు. 17వ లోక్ సభ కు ప్రాతినిధ్యం వహించిన బిజెపి సాధించిన విజయాలను ఆయన పార్లమెంట్ సాక్షిగా ప్రస్తావించారు. 17వ లోక్ సభ చివరి సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ముఖ్యంగా స్పీకర్ ఓం బిర్లాకు ధన్యవాదాలు తెలిపారు.

 

More

From National politics

ప్రధాని ఏమన్నారంటే..

 

“ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో కొత్త అధ్యాయాన్ని లిఖించాం. కోవిడ్ ప్రబలిన సమయంలో అత్యంత చాకచక్యంగా ఆ వ్యాధిని నియంత్రించాం. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా చేసాం. గత ఐదు సంవత్సరాలుగా దేశంలోని పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాం. కోవిడ్ సమయంలో ఎంపీలు తమ జీతంలో 30 శాతం తగ్గించుకున్నారు. క్యాంటిన్లో ఆహార సబ్సిడీ కూడా వద్దనుకున్నారు. పాత పార్లమెంట్ నుంచి కొత్త భవనంలోకి మారినప్పుడు సెంగోల్ ఏర్పాటు చేశాం. అది భారతీయ అస్తిత్వానికి ప్రతీక” అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 17వ లోక్ సభ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నది అని ప్రకటించిన నరేంద్ర మోడీ, ఆర్టికల్ 370 రద్దును ప్రముఖంగా ప్రస్తావించారు. రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్, ఇతర ప్రభృతులు తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పైనుంచి ఆశీర్వదిస్తారనే నమ్మకం తనకుందని నరేంద్ర మోడీ ప్రకటించారు.

 

ట్రిబుల్ తలాక్ రద్దుతో…

 

ఈ ఐదు సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను పదేపదే ప్రస్తావించిన నరేంద్ర మోడీ.. ట్రిబుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం వంటి విషయాలు మైలు రాళ్ళుగా నిలిచాయని ప్రకటించారు. “రాబోయే 25 సంవత్సరాలు దేశానికి చాలా కీలకం. దేశ ప్రజలకు రాజకీయంగా ఎన్నో ఆకాంక్షలున్నాయి. అభివృద్ధి పరంగా ఎన్నో కలలు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ దేశం కచ్చితంగా భర్తీ చేస్తుంది. ప్రపంచం కోణంలో చూస్తే “వీక్షిత్ భారత్” అవుతుందని” నరేంద్ర మోడీ ప్రకటించారు. “ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కొంతమంది చాలా ఒత్తిడితో ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. దానిని మేము ఖచ్చితంగా అంగీకరిస్తాం. ప్రజాస్వామ్యం గొప్పదనం కూడా అదే. వచ్చే ఎన్నికలు మన దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని” నరేంద్ర మోడీ ప్రకటించారు. కాగా 17వ లోక్ సభ చివరి సమావేశాన్ని మోడీ తనకు అనుకూలంగా మలుచుకోవడం.. తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావించడంతో ప్రతిపక్షాలకు నోరు మెదిపే అవకాశం లేకుండా పోయింది. నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో 17 లోక్ సభ అనే యాష్ ట్యాగ్ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *