తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. ఓవైపు రాష్ట్రంలో ఇంటర్ మార్కుల రగడ కొనసాగుతుండగా, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం కేరళ వెళ్లడంపై ఆయన మండిపడ్డారు. విద్యార్థులు మరణిస్తే వెళ్లడానికి సుముఖత చూపని కేసీఆర్ కు కేరళ పర్యటన అంత ముఖ్యమైందా? అంటూ నిలదీశారు. ఇవాళ కేసీఆర్ ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లడం తెలిసిందే. అక్కడ సీఎం పినరయి విజయన్ తో ఆయన ఫెడరల్ ఫ్రంట్ విషయం చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ తాజా వ్యాఖ్యలు చేశారు.
ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి పారిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. వచ్చే రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవాలంటూ తాను పెద్దమ్మ గుడిలో మొక్కుకున్నట్టు వీహెచ్ చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను తరిమికొట్టాలంటూ ప్రజలకు చెబుతానని అన్నారు.