తెలుగు తేజానికి భారతరత్న..

తెలుగుతేజం, మాజీ ప్రధానమంత్రి, దివంగత పాములపర్తి వెంకట నరసింహారావుకు.. అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆయనకు భారతరత్న అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

 

పీవీ నరసింహారావుతో పాటు మాజీ ప్రధాని, దివంగత చౌదరి చరణ్ సింగ్‌‌కు భారతరత్న పురస్కారానికి నామినేట్ చేసినట్లు తెలిపారు. ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌ పేరును భారతరత్న పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

 

ఇదివరకే బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీలకూ ఈ అవార్డును కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎల్ కే అద్వానీ మినహా మిగిలిన ముగ్గురికీ మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఇప్పటివరకు మొత్తం అయిదుమందికి భారతరత్న పురస్కారం లభించినట్టయింది.

 

తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు అపర చాణక్యుడిగా పేరుంది. రాజీవ్ గాంధీ హత్యానంతరం అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 జూన్ నుంచి 1996 మే వరకూ ప్రధానిగా పూర్తికాలం పని చేశారు. పీవీ.. మైనారిటీలో ఉన్న అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాల పాటు విజయవంతంగా నడపగలిగారు.

తన హయాంలో దేశాన్ని సంస్కరణల వైపు నడిపించిన ఆర్థికవేత్త.. పీవీ. మానవతా దృక్పథంతో కూడిన సంస్కరణలకు ఆద్యుడు ఆయనే. దేశ ఆర్థిక రంగ వ్యవస్థ ఇంత బలంగా మారడానికి అప్పట్లో పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలే కారణం. ప్రధాని పదవిని అధిష్ఠించడానికి ముందు కేంద్రంలో అత్యంత కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. హోం శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా దేశ గమనాన్ని మార్చివేశారు.

 

కేంద్రానికి వెళ్లడానికి ముందు 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో ముఖ్యమంత్రిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. మంథని ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం. ఎంపీగా హన్మకొండ, మహారాష్ట్రలోని రామ్‌టెక్ స్థానాల నుంచి రెండు సార్లు చొప్పున లోక్‌సభకు ఎన్నికయ్యారు.

 

ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఉప ఎన్నిక ద్వారా నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 6.26 లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు పీవీ. ఇప్పటికీ ఈ స్థాయిలో మెజారిటీ ఎవ్వరికీ దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *